
బాసర ట్రిపుల్ ఐటీ ని గత మూడు నెలల క్రితం దత్తత తీసుకున్న ఎస్పీ, దత్తత నుండి తప్పుకొన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే…. బాసర ట్రిపుల్ ఐటీ లో తరచూ గతంలో ఆందోళనలు, విద్యార్థుల ఆత్మహత్యలతో వార్తలకు ఎక్కేది. అయితే గత కొన్ని నెలలుగా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ట్రిపుల్ ఐటీ ని దత్తత తీసుకోని ట్రిపుల్ వీసీ సహకారంతో విద్యార్థుల కోసం పలు అవగాహన కార్యక్రమలు ఏర్పాటు చేసి మనోధైర్యాన్ని నింపారు. ఎస్పి దత్తత తీసుకున్నప్పటి నుండి ట్రిపుల్ ఐటీ లో ఎలాంటి ఆందోళనలు జరగలేదు. విద్యార్థులతో మమేకమై తరచూ ట్రిపుల్ ఐటీలో జరిగే సమావేశాలకు ఎస్పీ ప్రత్యేకంగా హాజరై విద్యార్థులతో మాట్లాడేది. ఏదైనా సమస్య ఉంటే విద్యార్థులు నేరుగా ఎస్పీకే ఫోన్ చేసి చెప్పేవారట. దీంతో ట్రిపుల్ ఐటీలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఎస్పీ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పదో రోజు ల క్రితం ఎస్పీ ట్రిపుల్ ఐటీ దత్తత నుండి తప్పుకోని వేరే పాఠశాల ను దత్తత తీసుకుంది. ఇది ఇలా ఉండగా ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులు పరీక్షలు బాగానే రాశారు. అయితే ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు ఫలితాలు వచ్చాయి. దీంతో కొంతమంది విద్యార్థులు శుక్రవారం మేము పరీక్షలు బాగానే రాశామని ఎందుకు ఫెయిల్ చేశారని సంబందిత అధికారిని నిలదీశారు. రివాల్యుయేషన్లో కొంతమంది విద్యార్థులు పాస్ అయ్యారు. దీంతో విద్యార్థులు ఆందోళన కు దిగటం చర్చనీయాంశం గా మారింది. కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తలకు ఎక్కటం గమనార్హం. ట్రిపుల్ ఐటీ దత్తత నుండి ఇటివలే తప్పుకున్నట్లు ఎస్పీ జానకి షర్మిల నవతెలంగాణ కు శనివారం తెలిపారు. కడెం మండలంలో ఓ పాఠశాల ను దత్తత తీసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.