నవతెలంగాణ – తాడ్వాయి
వచ్చే నెల ఫిబ్రవరి12 నుంచి 15 వరకు జరగనున్న మినీమేడారం జాతరకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు ములుగు జిల్లా ఎస్పీ శబరీస్ అన్నారు. శుక్రవారం భద్రత ఏర్పాట్లపై మేడారంలో గద్దెల ప్రాంగణం, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, జంపన్న వాగు, రెడ్డిగూడెం, ఇంగ్లీష్ మీడియం, కొంగల మడుగు, కన్నెపెల్లి స్తూపం పరిసరాలను పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. మినీ మేడారం జాతరకు వచ్చు భక్తుల రద్దీని క్రమబద్ధంగా నిర్వహించడానికి రోడ్ల సౌకర్యం, చెక్ పోస్టుల ఏర్పాటు, భారీ గేట్ల ఏర్పాటు, విఐపి వీవీఐపీల యొక్క భద్రత నిర్వహణ, రోప్ పార్టీ నిర్వహణ, మీడియా ప్రతినిధుల వెసులుబాట్లు, పరిమితులు మరియు ఇతర బందోబస్తు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ శబరీస్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 12నుండి 15 వరకు జరుగు మినీ మేడారం జాతరకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దొంగతనాలు, అసాంఘిక కార్యక్రమాలు ఎలాంటి జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చి ప్రశాంతంగా వనదేవతలను దర్శించుకుని ఎవరి ఇళ్లళ్లకు వారు వెళ్లే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎన్ రవీందర్, పస్రా సిఐ గద్ద రవిందర్, స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, సివిల్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.