
– మాడ్రిడ్‌కు వందలాదిగా ట్రాక్టర్లతో ప్రదర్శన
మాడ్రిడ్ : మితిమీరిన అధికార యంత్రాగం ఆంక్షలు, ఏ మాత్రమూ సరిపోని ప్రభుత్వ సాయం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ స్పెయిన్ రైతాంగం ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే స్పెయిన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్ళేందుకు బుధవారం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కు వందలాదిగా ట్రాక్టర్లతో రైతులు వచ్చారు. యురోపియన్ దేశాల్లో రైతాంగం వారాల తరబడి ఆందోళనలు సాగిస్తోంది. ఇటీవలే పోలెండ్, గ్రీస్, చెక్ రిపబ్లిక్‌ల్లో రైతు నిరసనలు జరిగాయి. యురోపియన్ యూనియన్ ఉమ్మడి వ్యవసాయ విధానంతో ముడిపడిన అధికార ఆంక్షలు, జాప్యందారీ విధానాలను తగ్గించాలని వారు కోరుతున్నారు. పైగా యురోపియన్ యూనియన్ పర్యావరణ నిబంధనలను కూడా సడలించాలని రైతులు కోరుతున్నారు. మాడ్రిడ్‌లోని సెంట్రల్ ఇండిపెండెన్స్ స్వ్కేర్ వద్దకు చేరేందుకు ఐదు వరుసల్లో ట్రాక్టర్లు క్యూలు కట్టాయి. పసుపు రంగు దుస్తులు ధరించిన ఆందోళనకారులు స్పానిష్ పతాకాలు చేబూని, ఆవు గంటలను మోగించారు. ఆ ప్రాంతంలో వీధులన్నీ ఆందోళనకారులతో నిండిపోయాయి. దాంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మాడ్రిడ్‌లోకి రాకుండా ట్రాక్టర్లను పోలీసులు అడ్డగించారంటూ కొంతమంది రైతులు ఫిర్యాదు చేశారు. 500 ట్రాక్టర్లను మాత్రమే అనుమతించామని ప్రభుత్వం తెలిపింది. ఆందోళన చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి కోరినపుడు నిర్వాహకులు 500 వాహనాలే చెప్పారని, అందుకే అంతవరకే తాము అనుమతి మంజూరు చేశామని పోలీసులు చెప్పారు. మరో 150 వాహనాలను నగరంలోకి రాకుండా అడ్డుకున్నారు. వ్యవసాయ రంగానికి సాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు ప్రోత్సాహక ధరలు కావాలని ద్రాక్ష రైతు లూసియా రిసెనో డిమాండ్ చేశారు. గతంలో ఎంత ఖర్చు పెట్టానో ఇప్పుడూ అంతే పెడుతున్నా అందులో సగం మొత్తం కూడా ఇప్పుడు రావడంల లేదని ఆమె వాపోయారు. ఈ తరహా పరిస్థితిని ఇలా కొనసాగించలేమన్నారు. రైతులకు సాయం చేసేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకునేవరకు ఈ నిరసనలు, ఆందోళనలు కొనసాగుతునే వుంటాయని ఆమె స్పష్టం చేశారు. స్పానిష్ రైతాంగం రక్షణవాదాన్ని కోరుకుంటోందని, తమ ఉత్పత్తులను కాపాడుకుంటూ, అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడేలా చేయాలనుకుంటున్నామని అడాల్ఫో అనే మరో రైతు చెప్పారు.