రైతుల పక్షాన అసెంబ్లీలో మాట్లాడండి

– ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన రైతు స్వరాజ్య వేదిక
– కౌలు రైతులకు న్యాయం చేయాలని విన్నపం
నవతెలంగాణ – భైంసా
కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేయడం లేదని రైతుల పక్షాన అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు రైతు స్వరాజ్య వేదిక నాయకులు వినతి పత్రాన్ని అందించారు. సోమవారం తన నివాసంలో కలిసి రైతుల సమస్యలపై మాట్లాడారు. కౌలు రైతులకు ఎల్ ఈ సి కార్డులతో పాటు, రైతు భరోసా పథకం వర్తించేటట్లు చూడాలన్నారు. రాష్ట్రంలో లక్ష 17వేల కౌలు రైతులు ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తుందన్నారు. ఇప్పటివరకు రైతాంగానికి రైతు భరోసా నిథులు అందడం లేదని ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలన్నారు. అదేవిధంగా 50 శాతం మంది రైతులకు ఇప్పటికి రుణమాఫీ రావడం లేదని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందరికీ రుణమాఫీ అందేలా చూడాలని వారు కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతానని, రైతులకు న్యాయం చేసే వరకు పోరాడుతానన్నారు. కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న, రైతులు మాణిక్ రావ్, లస్మన్న, కిస్టు, సతీష్, వెంకటేష్, వివేకానంద తదితరులు ఉన్నారు..