మానవ హక్కుల ఉల్లంఘనలపై మాట్లాడండి!

– శ్రీ రిషి సునాక్‌ను కోరిన
– అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌
లండన్‌ : భారత్‌లో చోటు చేసుకుంటున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై మాట్లాడాల్సిందిగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ను కోరింది. భారత్‌లో మైనారిటీ గ్రూపులపై విద్వేష నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో మానవ హక్కుల పరిస్థితులు దయనీయంగా వున్నాయని, వాటిని జి-20 సదస్సులో ప్రస్తావించాల్సిందిగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, సునాక్‌కు విజ్ఞప్తి చేసింది. బిజెపి పాలనలో అక్కడ ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలపై విద్వేష నేరాలు పెరిగిపోయాయని పేర్కొంది. మణిపూర్‌లో లైంగిక వేధింపులు, హింసలకు సంబంధించి తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘటనలు జరిగిన ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ బ్రిటన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సచా దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ, జి 20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో అక్కడ మానవ హక్కుల రికార్డు గురించి ప్రధాని మోడీతో బహిరంగంగా, నిర్భయంగా మాట్లాడే అవకాశం రిషి సునాక్‌కి వచ్చిందని అన్నారు. భారత్‌, బ్రిటన్‌ మధ్య జరగాల్సిన వాణిజ్య చర్చలు ఈ అవకాశాన్ని, అంశాన్ని అణచివేయరాదని అన్నారు. మోడీ నేతృత్వంలో అధికార యంత్రాంగం జర్నలిస్టులపై, మానవ హక్కుల కార్యకర్తలపై దాడులు, వేధింపులకు పాల్పడుతున్నది. ఎన్‌జిఓ, మీడియా సంస్థల కార్యాలయాలపై దాడులకు దిగుతోంది.