– ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్
నవతెలంగాణ-భైంసా
బైంసా మండలం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. బుధవారం ఎంపీపీ అబ్దుల్ రజాక్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారీ వర్షాలతో సిరాల ప్రాజెక్టు దెబ్బతిందని గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రస్తుత ఇరిగేషన్ మంత్రికి విన్నవించడంతో రూ.9 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఆరు నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో ప్రజలకు వ్యాధుల ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రత, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ బాగుండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సమావేశంలో సభ్యులు పలు అంశాలను ప్రస్తావించగా ప్రమాదకారంగా ఉన్న విద్యుత్ తీగలను తక్షణమే సరి చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ కనెక్షన్లను ఇవ్వాలన్నారు. మిషన్ భగీరథ అధికారులు గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం ముగిస్తున్న తరుణంలో ఐదు సంవత్సరాల పాటు సేవలు అందించిన వారిని అభినందించడంతో పాటు మరోసారి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై సేవలందించాలని ఆకాంక్షించారు. సమావేశంలో జడ్పీటీసీ దీప సొలంకి భీంరావ్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి, మండల విద్యాధికారి సుభాష్, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సారెడ్డి ఆయా శాఖల అధికారులున్నారు.