శానిటేషన్.. ప్లాంటేషన్ పై ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి 

— ఆశ ఏఎన్ఎమ్ లతో సమీక్షించాలి 
— డిపిఓ ఎంపీఓ హాజరును పర్యవేక్షించాలి
— రాష్ట్రస్థాయిలో పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి
— కలెక్టర్ నారాయణరెడ్డి 
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
శానిటేషన్, ప్లాంటేషన్ పై మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రత్యేక అధికారులు ఈ బుధవారం తప్పనిసరిగా రెండు గ్రామపంచాయతీలను ఆకస్మికంగా తనిఖీ చేసి శానిటేషన్, ప్లాంటేషన్ చూడాలని, అలాగే  శానిటేషన్ లో భాగంగా ఫాగింగ్, స్ప్రేయింగ్, తాగునీటిని పర్యవేక్షించాలని అలాగే ఆశ, ఏనం ఏఎన్ఎం లతో ఫీవర్ కేసులపై సమీక్షించాలని తెలిపారు.
ప్రతి ఇంట్లో దోమతెరలు వాడుతున్నది లేనిది తనిఖీ చేయాలని, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, రహదారులకు ఇరువైపులా, అన్ని ప్రభుత్వ సంస్థలలో మొక్కలు నాటింది లేనిది తనిఖీ చేయాలన్నారు. డిపిఓ ఇకపై ఎంపీఓల హాజరును పర్యవేక్షించాలని, గ్రామపంచాయతీ కార్యదర్శులు ఉదయం ఏడు గంటలకి గ్రామాలలో ఉండాలని చెప్పారు.10 ఇళ్లల్లో జ్వరాలపై శాంపిల్ సర్వే నిర్వహించాలన్నారు. ఇకపై ప్రతివారం 2 మున్సిపాలిటీలపై సమీక్షిస్తానని తాగునీరు, శానిటేషన్, పురోగతిలో ఉన్న పనులపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. హాస్టల్లలో విద్యార్థులకు తాగునీరు, భోజనం, టాయిలెట్స్ వాటన్నిటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, వైధాధికారులు ప్రతినెల తప్పనిసరిగా హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యాన్ని పరీక్షించాలని చెప్పారు. ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలని, రాష్ట్రస్థాయి ప్రజావాణి దరఖాస్తులు 91 పెండింగ్లో ఉన్నాయని వాటి సైతం పరిష్కారం చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టరేట్ టీ. పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.