– రైతు బీమా తరహాలో ప్రమాద బీమా
– ప్రజా భవన్‌లో సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో ప్రత్యేక సెల్
– సెప్టెంబర్ 17లోగా సమస్యల పరిష్కారానికి కృషి
– నిజామాబాద్‌లో కాంగ్రెస్‌కు పట్టంకట్టండి : గల్ఫ్ కార్మిక సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్ దక్కన్‌లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో ఆయన సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గల్ఫ్ వెలుతున్న వారిలో ఏజెంట్ల బారిన పడి కొందరు, యాజమాన్యం చేతిలో మరికొందరు కార్మికులు మోసపోతున్న నేపథ్యంలో చట్టబద్దంగా వారి హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రజాభవన్‌లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు తెలిపారు. కార్మికులు తమ సమస్యలను నేరుగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రైతు బీమా లాగా గల్ఫ్ కార్మికులకు ప్రమాద బీమా ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్‌తో పాటు మన దేశంలో కేరళ అనుసరిస్తున్న వలస కార్మిక విధానాలను అధ్యయనం చేస్తున్నామనీ, త్వరలో మంచి పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు. గల్ఫ్‌లో మోసపోయిన బాధితులకు న్యాయపరమై సాయం అందించడంతో పాటు ఆయా దేశాలతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక విధానాన్ని తయారు చేస్తామనీ, ఎన్నికల కోడ్ ముగిశాక కార్మిక సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాలు, సూచనలను తీసుకుని ముందుకెళతామని పేర్కొన్నారు. గల్ఫ్ ఏజెంట్లు విధిగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకునేలా చర్యలు చేపడుతామని తెలిపారు. బతుకుదెరువు కోసం వలస వెళ్లే కార్మికులు దేశం కాని దేశంలో ఇబ్బందులు పడకుండా అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు వారం రోజుల పాటు శిక్షణ అందించన్నుట్టు ప్రకటించారు. ఉత్తర తెలంగాణ నుంచి లక్షలాది మంది కార్మికులు పొట్టకూటి కోసం సౌదీ, ఒమన్, మస్కట్ తదితర దేశాలకు వలస పోతున్నారనీ, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17లోపు వారి సమస్యలకు ఓ పరిష్కారం కనుగొంటామని వెల్లడించారు. పార్లమెంట్‌లో గల్ఫ్ కార్మికుల గొంతు వినిపించేందుకు వీలుగా నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ను గెలిపించాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, గల్ఫ్ ఎన్‌ఆర్‌ఐ కార్మిక సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.