ప్రత్యామ్నాయ విద్యుదుత్పత్తిపై ప్రత్యేక దృష్టి

Special focus on alternative power generation– 2030 అవసరాలకనుగుణంగా ఉత్పత్తి :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– చందనవెళ్లిలో జున్నా సోలార్‌ పవర్‌ ప్యానెల్‌ ప్లాంటు ప్రారంభం
నవతెలంగాణ-చేవెళ్ల
రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్‌ ఉత్పత్తికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం చందనవెళ్లి గ్రామంలో శుక్రవారం జున్నా సోలార్‌ పవర్‌ ప్యానెల్‌ ఉత్పత్తి ప్లాంటును ఆయన ప్రారంభించారు. సోలార్‌ పవర్‌ ప్యానెల్‌ ఉత్పత్తి విధానం గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. గ్లాస్‌ లోడింగ్‌, భస్సింగ్‌, లే అప్‌, ల్యామినేటింగ్‌ ఫ్రేమింగ్‌, క్యూరింగ్‌ లైన్‌, క్లీనింగ్‌ సెక్షన్‌, సన్‌ సిమ్‌ లెటర్‌, ఐ పోర్టు, ఫైనల్‌ ఈ.ఎల్‌ ప్రాసెస్‌ యూనిట్స్‌ను పరిశీలించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 2030 నాటికి ప్రజల వినియోగానికి ఉండే డిమాండ్‌కనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్తును ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రపంచంలో మానవ జాతికి.. విద్యుత్‌ శక్తికి మధ్య విడదీయరాని బంధం ఏర్పడిందన్నారు. విద్యుత్‌ శక్తి అవసరాల డిమాండ్‌ రోజు రోజుకూ పెరిగిపోతున్న క్రమంలో అందుకనుగుణంగా ప్రత్యామ్నాయంగా విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుకోవాల్సి ఉంటుందన్నారు. విద్యుత్‌ రంగంపై గత ప్రభుత్వం రూ.81 వేల కోట్ల పైబడి అప్పుల భారం మోపిందన్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్‌ ఉత్పత్తి కోసం మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ వేసిన పునాదులు ప్రజల అవసరాలు తీర్చుతున్నాయని వివరించారు. చంద్రన్‌వెల్లి గ్రామంలో భూసేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని భట్టి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఎంజారుమెంట్‌ సర్వే పేరిట భూమి లేని వారి పేర్లను భూ సేకరణలో చేర్చి నిజమైన రైతులకు పరిహారం ఇవ్వలేదని.. గతంలో తాను పాదయాత్రలో భాగంగా ఈ ఊరికి వచ్చినప్పుడు రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. భూ భాధితుల విజ్ఞప్తి మేరకు నిజమైన లబ్దిదారులకు పరిహారం ఇప్పించేందుకు సమగ్ర విచారణ చేయిస్తాన్నారు. పరిహారాన్ని కొల్లగొట్టిన దళారులపై విచారణ చేయించి వాస్తవాలు బయటికి తీసుకొస్తామన్నారు. భూ బాధితులకు స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పరిశ్రమలు అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, పరిశ్రమ నిర్వాహకులు జున్న శేఖర్‌ రెడ్డి, జున్న బస్వీ రెడ్డి, ఈదుల నరేందర్‌ రెడ్డి, భీమవరపు అనిల్‌ కుమార్‌ రెడ్డి, భీమవరపు దుర్గాప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పామేనా భీమ్‌ భరత్‌ పాల్గొన్నారు.