– టీజీఎస్పీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో డీజీపీ జితేందర్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర పోలీసు శాఖలో బాక్సింగ్, క్రికెట్ క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించి శిక్షణన ఇప్పిస్తామని డీజీపీ డాక్టర్ జితేందర్ వెల్లడించారు. శుక్రవారం యూసఫ్‌గూడలోని టీజీఎస్పీ గ్రౌండ్స్‌లో ఈ విభాగానికి చెందిన కానిస్టేబుళ్ల శిక్షణానంతర ముగింపు కవాతుకు డీజీపీ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో తన ప్రత్యేకతను స్పెషల్ పోలీసు బెటాలియన్ కానిస్టేబుళ్లు, అధికారులు నిలుపుకున్నారని మెచ్చుకున్నారు. రాష్ట్రమేగాక ఇతర రాష్ట్రాల్లో సైతం విధులను నిర్వర్తించి మంచి పేరును సాధించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4077 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లు ఈ విభాగానికి కొత్తగా జత కూడారని ఆయన అన్నారు. బాక్సింగ్‌లో అంతర్జాతీయ పతకాలను సాధించిన నిఖత్ జరీన్, క్రికెట్‌లో బౌలర్‌గా అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన మహ్మద్ సిరాజ్‌లకు డీఎస్పీ హౌదాలనిచ్చి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించిందనీ, వీరి నాయకత్వంలోనే పోలీసు శాఖలో సిబ్బందికి బాక్సింగ్, క్రికెట్‌లలో తర్ఫీదును ఇవ్వబోతున్నామని డీజీపీ తెలిపారు. టీజీఎస్పీ బెటాలియన్ డైరెక్టర్ జనరల్ సంజరు కుమార్ జైన్ మాట్లాడుతూ.. ఈ సారి ఎంపికైన కానిస్టేబుళ్లలో 500లకు పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 2000కు పైగా డిగ్రీ స్థాయి విద్యార్థులున్నారని చెప్పారు. వీరికి శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అవసరమైతే మత్తు పదార్థాల నిరోధం, యాంటీ సైబర్ క్రైమ్‌తో పాటు సీఐడీ విభాగాలలో సైతం వీరికి తర్ఫీదునిచ్చి సేవలను వినియోగించుకుంటామని తెలిపారు.