నవతెలంగాణ-కుభీర్
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ డా.జానకి షర్మిల ఆదేశాల మేరకు బైంసా సబ్ డివిజన్‌లో అన్ని పోలీస్ స్టేషన్‌లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఏఎస్పీ అవినాష్ కూమార్ తెలిపారు. శుక్రవారం మండలంలోని పార్డి(బి) గ్రామంలో ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా యువకులు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల అధిక చోట్ల రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం మద్యం మత్తులో వాహనాలు నడపడం ఒకటైతే, మరొకటి ర్యాష్ డ్రైవింగ్ చేయడం అన్నారు. అదేవిధంగా మైనర్లు బైకులు, కార్లు నడుపుతూ వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు, దీంతో పాటు ఇన్సూరెన్స్ లేని వాహనాల వాళ్ల జరిగే ప్రమాదాలలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి ఎటువంటి ఆర్దిక సాయం అందదు. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన జిల్లా పోలీసులు ప్రతిరోజు గ్రామాల్లో వాహనాల తనిఖీలు చేపడుతున్నారని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి పట్టుబడ్డ యువకులకు మద్యం తాగడం ద్వారా కలిగే అనర్థాలు, వారికి భవిష్యత్తులో జరిగే నష్టాల గురించి తల్లితండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించటం జరుగుతుందని అన్నారు. అదే విధంగా రెండో సారి మద్యం తాగి పట్టు పడితే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రనే రోడ్డు ప్రమాదాల నియంత్రనే లక్ష్యంగా ప్రతి రోజూ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించటం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు, వ్యాపార సముదాయాలలో, గ్రామాలలో, తాండలలో నిత్యం పోలీస్ జాగిలాలతో తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణాను నిరోధించడానికి నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొంది తనిఖీలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలను కనిపెట్టడంలో జాగిలాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తూ, అక్రమార్జనే ధ్యేయంగా నిషేధిత గంజాయిని రవాణా చేసే వ్యక్తులను పట్టుకోవడానికి వాహన తనిఖీలు చేపట్టడంతో పాటు పోలీస్ జాగిలాల సహాయంతో కూడా వారిని పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా నిషేధిత గంజాయిని రవాణా చేస్తున్నట్లు గానీ, విక్రయిస్తున్నట్లు గానీ సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి డైల్ 100కి సమాచారం అందించాలని సూచించారు. అదే విధంగా ఎలాంటి సమస్య లేకుండానే కొందరు వ్యక్తులు 100కు కాల్ చేయడం జరుగుతుందని వారిపైనే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామంలోని ఆలయం, పాఠశాల పరిసర ప్రాంతాల్లో గల మద్యం, బెల్ట్ షాపులను తోలగించాలని ఏఎస్పీకి విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామస్తులు ఏఎస్పీకి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భైంసా రూరల్ సీఐ నైలు, కుంటాల ఎస్సై, కుభీర్ పోలీసులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.