– హౌదా ఇస్తేనే అసలైన నిబద్ధత నిరూపితం
– వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ ఇద్దరూ సమాధానం చెప్పాలి : కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాని మోడీ జోక్యం చేసుకుని.. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హౌదాను కల్పించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఫిబ్రవరిలో రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోడీ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హౌదా కల్పిస్తేనే ఆంధ్రప్రదేశ్ పట్ల అసలైన నిబద్ధత నిరూపితమవుతుందని పేర్కొన్నారు. గత వారం రోజులుగా మంగళగిరిలో ఎయిమ్స్, తిరుపతిలో ఐఐటీని ప్రధాని మోడీ ప్రారంభించారని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ”ఈ రెండు సంస్థలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇచ్చిన హామీలే. అయితే ప్రధాని మోడీ ఇప్పుడు వీటిని తన వల్లే వచ్చినట్టు చెప్పుకుంటున్నారు” అని జైరాం రమేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిని పటిష్టం చేసేందుకు ప్రధాని రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కల్పిస్తేనే ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్న నిజమైన నిబద్ధత నిరూపితమవుతుందని అన్నారు. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ప్రత్యేక హౌదా హామీకి కట్టుబడి ఉన్నారని రమేశ్ చెప్పారు.
”మన్మోహన్ సింగ్ ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ప్రత్యేక హౌదాకు ఐదేండ్ల పాటు కట్టుబడి ఉంటామన్నారు. అప్పటి బీజేపీ ఎంపీ ఎం. వెంకయ్య నాయుడు లేచి ఇలా ప్రకటించారు. కేవలం ఐదేండ్లు ఎందుకు? బీజేపీ ప్రభుత్వం వస్తే.. పదేండ్లు ఇస్తుందని అన్నారు” అని జైరాం రమేశ్ గుర్తు చేశారు. ”వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ ఇద్దరూ సమాధానం చెప్పాలి” అని రమేశ్ అన్నారు.