ఎన్టీఆర్‌ పై వచ్చిన ప్రత్యేక సంచిక

On NTR Special issueనందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను అటు సినీ-కళా- సాంస్కృతిక రంగాలలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ సాధించిన కృషిని నేటి తరానికి తెలియజేయాలనే కోరికతో ‘ఎన్టీఆర్‌ ఏ 100’ పేరుతో చెన్నపురి తెలుగు అకాడమీ ఈ 550 పేజీల బహత్‌ సంచికను తీసుకురావడం అభినందనీయం.
ముందుగా ఇందులో ఏడుగురు రాజకీయ ప్రముఖుల సందేశాలు ఉన్నాయి. తర్వాత ఇంగ్లీష్‌ సెక్షన్‌లో ఏడుగురు ప్రముఖులు రాసిన వ్యాసాలు ఉన్నాయి. తర్వాత ఎన్టీఆర్‌ చేసిన మూడు ఉపన్యాసాలతో పాటు ఘంటసాల, సి.నారాయణరెడ్డి, నాగభైరవ కోటేశ్వరరావు, వేటూరి సుందర రామమూర్తి రాసిన నాలుగు ‘ఎన్టీఆర్‌ పై నివాళి వ్యాసాలు’ ఉన్నాయి. తర్వాత నటుడిగా ఎన్టీరామారావు పౌరాణిక చిత్రాలలో, చారిత్రిక చిత్రాలలో, జానపద చిత్రాలలో, సాంఘిక చిత్రాలలో, తన సొంత చిత్రాలలో నటించిన గొప్పతనాన్ని వివరిస్తూ నందమూరి వారి నట విశ్వరూపాన్ని తెలియజేశారు. సాంకేతిక నిపుణుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన గొప్పతనాన్ని తెలియజేసే వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం 23 మంది ప్రముఖులు రాసిన ఈ వ్యాసాలు నందమూరి వారి నిబద్ధతను, గొప్పదనాన్ని, విశిష్టతను తెలియజేస్తాయి.
పరిపాలనా రంగంలో ఎన్టీఆర్‌ చేసిన కృషిని వివరిస్తూ పదిమంది ఉన్నతాధికారులు రాసిన వ్యాసాలున్నాయి. తర్వాత పదిమంది ప్రముఖుల ‘పెద్దల పలుకులు’, సినీ రంగానికి సంబంధించిన వారి వారసులు, కవులకు వారితో కలిగిన ఆత్మీయ అనుబంధాన్ని ఐదు వ్యాసాలలో తెలియజేశారు. ఎన్టీఆర్‌ హయాంలో నెలకొల్పబడిన తెలుగు విశ్వవిద్యాలయం ప్రాముఖ్యతను వివరిస్తూ అక్కడి అధ్యాపకులు, ఉద్యోగులు రాసిన 12 వ్యాసాలు ‘విద్యారంగం’ శీర్షికలో కనిపిస్తాయి. అలాగే ‘సాంస్కృతిక రంగానికి’ సంబంధించిన ఐదు వ్యాసాలు, ఐదుగురు ‘కళాకారుల వినతి’, ముగ్గురు పాత్రికేయుల అనుభవాలు, 8 మంది అభిమానుల వ్యాసాలు, ఇద్దరి ప్రముఖుల జ్ఞాపకాలు, తొమ్మిది మంది అభిమానుల ప్రశంసలు, రెండు తులనాత్మక వ్యాసాలు, మూడు ప్రహసననాలతో ఈ సంచిక బోలెడంత సమాచారంతో నిండి ఉంది. సమాచారాత్మకము, విజ్ఞానాత్మకం అయిన వ్యాసాలతో నిండి ఉన్న ఈ పుస్తకం ఎప్పటికీ భద్రపరచుకోదగినది.
– కె.పి అశోక్‌ కుమార్‌, 9700000948