– హైదరాబాద్‌ను మరింత సురక్షితంగా మారుస్తాం : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మరోసారి రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేననీ, వచ్చే ఐదేండ్లలో మహిళల కోసం ఏం చేస్తామనే అంశాలతో డిసెంబర్‌లో ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేస్తామని రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మహిళలు హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా భావిస్తున్నారనీ, ఈ నగరాన్ని మరింత సురక్షితంగా మార్చేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ ఫార్వర్డ్ తెలంగాణలో భాగంగా ఉమెన్ ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మహిళల కోసం ప్రత్యేక నాలుగు ఇండిస్టియల్ పార్కులు తెచ్చామని గుర్తుచేశారు. తన జీవితంలో సానియా మీర్జా, సైనా వంటి ఎంతో మంది శక్తివంతులైన మహిళలను చూశానన్నారు. ఉమ్మడి కుటుంబాల్లో మహిళల పాత్ర కీలకమనీ, తాను ఉమ్మడి కుటుంబంలో పెరిగినట్టు చెప్పారు. మహిళల కోసం వడ్డీ లేని రుణాలు, ప్రత్యేక ఇండిస్టియల్ పార్కులు, వి-హబ్‌తో పాటు మ్యానిఫెస్టోలో లేకున్నా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను ప్రత్యేకంగా మహిళల కోసం ప్రారంభించినట్టు కేటీఆర్ వివరించారు. ప్రత్యేక సౌకర్యాల కల్పనతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసూతీలు పెరిగాయనీ, మైనార్టీ బాలికలను విద్యలో ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి చిన్నారిపై రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు.