వ్యవసాయరంగంలో జీవవైవిధ్యం కోసం ప్రత్యేక ఎంజెడా

– టీఎస్‌బీబీ చైర్మెన్‌ రజత్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో వ్యవసాయ రంగంలో జీవవైవిధ్యం కోసం ప్రత్యేక ఎజెండాతో ముందుకెళ్తున్నామని తెలంగాణ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు(టీఎస్‌బీబీ) చైర్మెన్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో టీఎస్‌బీబీ, యునైటెడ్‌ నేషనల్స్‌ డెలప్‌మెంట్‌ ప్రోగ్రాం, ఎన్‌బీఏ సంయుక్తాధ్వర్యంలో బయోడైవర్సిటీ ఫైనాన్స్‌ ఇన్టిటేటివ్‌ ప్రాజెక్టుపై ఒప్పందం జరిగింది. రజత్‌కుమార్‌ సమక్షంలో యూఎన్‌డీపీ, టీఎస్‌బీబీ మధ్య ఒప్పందం పత్రంపై అధికారులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌బీఏ చైర్‌పర్సన్‌, రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ సి.చలేందర్‌రెడ్డి, తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, యూఎన్‌డీపీ క్లైమెట్‌ అడాప్టేషన్‌ చీఫ్‌ రుచిపంత్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజత్‌కుమార్‌, రఘునందన్‌రావు మాట్లాడుతూ..తెలంగాణ వ్యవసాయ జీవవైవిధ్య వారసత్వానికి ప్రసిద్ధి చెందిందన్నారు. దేశంలో బయోడైవర్సిటీని కాపాడేందుకు బయోఫిన్‌ సంస్థ ప్రజలు, ప్రభుత్వం, ప్రయివేటు రంగాలతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో పండే ప్రత్యేకమైన పంటలను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో మచ్చల కందుల సాగుతో రైతులు ఏవిధంగా లాభాలు పొందుతున్నారో వివరించారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పలు అంశాలను విడమర్చి చెప్పారు.