హను-మాన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌కి విశేష స్పందన

హను-మాన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌కి విశేష స్పందన‘విశేష ప్రేక్షకాదరణతో అఖండ విజయం సాధించిన ‘హను-మాన్‌’ చిత్రానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ నిపుణుడిగా పని చేసే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతం’ అని ఉదరు కృష్ణ అన్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ రంగంలో రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం కలిగి, ఈ క్రాఫ్ట్‌లో గ్రాఫిక్స్‌ మాంత్రికుడుగా పేరొందిన ఉదరు కష్ణ ‘హను- మాన్‌’ చిత్రానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించారు. తేజా సజ్జా టైటిల్‌ పాత్రలో ప్రైమ్‌ షో ఎంటర్త్సైన్మెంట్‌ పతాకంపై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదలై విజయ దుందుభి మోగిస్తోంది. ప్రశాంత్‌ వర్మ స్వయంగా సమకూర్చిన కథ – కథనాలకు ఉదరు కష్ణ సారధ్యంలో అద్దిన గ్రాఫిక్స్‌ జత కలవడంతో ఈ చిత్రం అత్యద్భుతంగా తెరకెక్కింది. ఈ సినిమాకి వస్తున్న అద్భుత స్పందనకు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ చిత్రానికి పని చేసిన తీరుని, దర్శకుడు ప్రతిభ గురించి ఉదరుకృష్ణ మాట్లాడుతూ, ‘భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ‘హనుమాన్‌’ చిత్రానికి పని చేసే అవకాశం ఇచ్చిన ప్రశాంత్‌ వర్మకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా వినియోగించుకోవడంలో విజనరీగా పేరొందిన ఎస్‌.ఎస్‌.రాజమౌళి సరసన సగర్వంగా నిలిచేంత దార్శనికత ప్రశాంత్‌ వర్మలోనూ పుష్కలంగా ఉంది. రెండేళ్లుగా నా జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన ఈ సినిమా సాధిస్తున్న సంచలన విజయం మేం పడిన కష్టమంతా మరిచిపోయేలా చేసింది. పతాక సన్నివేశాల్లో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్‌కు జీవం పోయడం ఈ చిత్రం కోసం నేను ఫేస్‌ చేసిన అతి పెద్ద ఛాలెంజస్‌లో ముఖ్యమైంది. దర్శకులు కలలు గనే ఎంత గొప్ప విజువల్‌ అయినా సునాయాసంగా సాకారం చేయగలనని ఈ సినిమా నిరూపించింది. ‘బీస్ట్‌ బెల్స్‌’ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థను హైదరాబాద్‌లో నెలకొల్పబోతున్నాను’ అని అన్నారు.