గిరిజన దర్బార్‌కు విశేష స్పందన

Special response to tribal durbarనవతెలంగాణ-భద్రాచలం
ఆదివాసీ గిరిజన గ్రామాలలో డెంగ్యూ వ్యాధులు ప్రబలుతున్నందున ఆశ్రమ పాఠశాలలో చదివే గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల పట్ల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్‌ జైన్‌ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం ఐటిడిఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో యూనిట్‌ అధికారుల సమక్షంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి ఆయన ఆర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపతు అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు తప్పనిసరిగా అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు. సోమవారం గిరిజన దర్బార్లో ఎక్కువ శాతం అర్జీలు పోడు భూముల సమస్యలు, పట్టా భూములకు రైతుబంధు రుణాలు, పోడు పట్టాలు, పోడు పట్టాలు ఆన్లైన్‌ చేయించుట, భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, గిరిజన గురుకుల పాఠశాల, ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలల్లో సీట్లు, ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో జీవన భృతి పెంపొందించుకోవడానికి శిక్షణలు ఇప్పించుట, వ్యవసాయానికి సంబంధించి కరెంటు, బోరు, మోటార్లు, ఒంటరి మహిళ, వితంతు మహిళ పింఛన్లు, ఇంటర్‌ క్యాస్ట్‌ మ్యారేజ్‌ ప్రోత్సాహకాలు ఇప్పించుట, పై చదువులు చదవడానికి ఆర్థిక సహాయం అందించుట, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం ఇప్పించుట, నూతనంగా ఏర్పాటు చేసిన మత్స్యకారుల సొసైటీ రిజిస్ట్రేషన్‌ చేయించుట, గిరిజన గ్రామాలలో రోడ్డు సౌకర్యం కల్పించుట, ఇతర ఆర్థిక ప్రయోజనాలకు గిరిజనులు దరఖాస్తులు చేసుకున్నారని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి గిరిజనులకు విడతల వారీగా తప్పనిసరిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్‌ ఇన్చార్జి ఆర్‌సీఓ గురుకులం డేవిడ్‌ రాజ్‌, డీడీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారిని మణెమ్మ, ఈఈ ట్రైబల్‌ వెల్ఫేర్‌ తానాజీ, ఎస్‌ఓ సురేష్‌ బాబు, డీటీఆర్‌ఓ ఎఫ్‌ఆర్‌ శ్రీనివాస్‌, ఏపీవో పవర్‌ మునీర్‌ పాషా, ఏడీ అగ్రికల్చర్‌ భాస్కరన్‌, ఉద్యానవనాధికారి అశోక్‌ కుమార్‌, డీఎస్‌ఓ ప్రభాకర్‌ రావు, జేడీఎం హరికృష్ణ, మేనేజర్‌ ఆదినారాయణ, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.