– ఈనెల 28 నుండి వచ్చేనెల 29 వరకు అభ్యంతరాల స్వీకరణ
– నవంబర్ 9, 10 తేదీలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు
– తుది ఓటరు జాబితాను జనవరి 6న ప్రచురిస్తాం
– జిల్లాలో 1812 పోలింగ్ కేంద్రాలు,1502203 మంది ఓటర్లు
– కలెక్టర్ ఇలా త్రిపాఠి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 1 జనవరి 2025 తేది ఆధారంగా వార్షిక ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు, ఈఆర్ఓ, ఏఈఆర్ ఓ కార్యాలయాలు, అన్ని పోలింగ్ కేంద్రాలలో ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించడం జరిగిందని తెలిపారు. ఈ జాబితాపై ఈనెల 29 నుండి వచ్చే నెల 28 వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని వెల్లడించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పై నవంబర్ 9 ,10 తేదీలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఆ రోజు బిఎల్ ఓలు వారి వారి పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉండి కొత్త ఓటరు నమోదు, ఓటరు జాబితాలో తొలగింపులు, తప్పొప్పులను సవరించేందుకు అవసరమైన ఫారాలను స్వీకరిస్తారని తెలిపారు. ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలను డిసెంబర్ 24 లోగా పరిష్కరించడం జరుగుతుందని, తుది ఓటరు జాబితాను 6 జనవరి 2025 న ప్రచురించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. ముసాయిదా ఓటరు జాబితా వివరాలను జిల్లా కలెక్టర్ వెల్లడిస్తూ జిల్లాలో 1812 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 740 971 మంది పురుష ఓటర్లు, 7,61105 మహిళ ఓటర్లు,127 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు, మొత్తం 1502203 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. 551 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. 18 సంవత్సరాలు పూర్తయి అర్హత ఉన్న వారు నూతన ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఫారం 6 లో నమోదు చేసుకోవచ్చని, చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లినవారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ఫారం 7 లో దరఖాస్తు చేసుకోవాలని, జాబితాలో తప్పులను సరిచేసుకునేందుకు ఫారం 8 లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.