ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి

– రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసింది
– విభజన హామీల అమలు ఊసేలేదు : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
– ఏచూరి, ఖర్గే, శరద్‌ పవార్‌, తిరుచ్చి శివను కలిసి కాంగ్రెస్‌ బృందం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ద్రోహం చేసిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, జెడి శీలం, గిడుగు రుద్రరాజు, తులసి రెడ్డి, మస్తాన్‌ వలీ, సుంకర పద్మశ్రీ తదిత రులు శుక్రవారం నాడిక్కడ ఏచూరీని కలిశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలని సీతారాం ఏచూరిని కోరారు. దీనికి స్పందించిన ఏచూరి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం కాంగ్రెస్‌ చేసే పోరాటానికి సీపీఐ(ఎం) మద్దతు ఉంటుందని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం సీపీఐ(ఎం) మొదటి నుంచీ పోరాడుతున్నదని తెలిపారు. రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందనీ, విభజన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని విమర్శించారు. ఏపీకి పదేండ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని బీజేపీ నేతలు అడిగారని, ఇప్పుడు వాళ్లే ప్రభుత్వంలో వున్నా ఇవ్వడం లేదని విమర్శించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం సీపీఐ(ఎం) మద్దతు కోరామని అన్నారు. ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. విభజన హామీలు అమలు చేయని బీజేపీకి వైసీపీ, టీడీపీ గులాం గిరి చేస్తున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సాధనకు చివరి వరకు పోరాటం చేస్తామని అన్నారు. అంతకు ముందు శరద్‌ పవార్‌ను ఆయన నివాసంలో, డీఎంకే రాజ్యసభ పక్షనేత తిరుచ్చి శివను ఆయన నివాసంలో, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గేని షర్మిలా రెడ్డి, ఇతర నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు కోరారు.