– మంత్రి దనసరి అనసూయ సీతక్క
నవతెలంగాణ – ములుగు
మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి తెలియజేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు, మీడియా ప్రతినిధులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ-శిశుసంక్షేమశాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అభినందనలు తెలిపారు. బుధవారం ములుగు జిల్లా బండారుపల్లి గిరిజన భవన్‌లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష్‌తో కలిసి మీడియా ప్రతినిధుల కృతజ్ఞతా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జాతర విజయవంతంలో ప్రతి ఒక్కరి అనుభవాల అనుసారం పుస్తక రూపంలో పొందుపరిచి లోపాలను పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించిన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ప్రతినిధుల సలహాల మేరకు జాతర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు.
ములుగు కేంద్రంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి గిరిజన యూనివర్సిటీ తరగతులు, జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్లు ప్రారంభిస్తామని అన్నారు. గోదావరి నది జలాలు రామప్ప సరస్సు నుంచి లక్నవరం సరస్సులోకి మళ్లించే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. జాతర విజయవంతంలో కీలకపాత్ర పోషించిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏటూరునాగారం అదనపు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, దేవాదాయశాఖ అధికారి రాజేందర్, పౌర సంబంధాలశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎండీ రఫీక్, డీఎస్పీ రవీందర్, తహసీల్దార్ విజయభాస్కర్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.