నకిలీ విత్తనాల నివారణకు ప్రత్యేక నిఘా

– ప్రత్యేక బృందాల ఏర్పాటు
– రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు
– వీడియోకాన్ఫరెన్స్‌లో ఎస్పీ అపూర్వరావు
నవతెలంగాణ-నల్లగొండ
నకిలీ విత్తనాల నివారణపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ కే.అపూర్వరావు అన్నారు. వానాకాలం సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా, నకిలీ విత్తనాలు నివారణ అంశంపై గురువారం పోలీస్‌, వ్యవసాయశాఖ అధికారులతో జిల్లా పోలీస్‌ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోక ముందే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, దీని కోసం జిల్లాలోని ప్రతీ సబ్‌ డివిషన్‌, సర్కిల్‌, మండల స్థాయిలలో పోలీస్‌, వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వీరు 24 గంటలు అందుబాటులో ఉంటూ నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారి పట్ల నిఘా పెడుతూ కేసులు నమోదు చేయబడతాయన్నారు. డీలర్లు తాము అమ్ముతున్న విత్తనాల షాప్‌లలో స్టాక్‌ బోర్డులు, లైసెన్సులు తప్పని సరిగ్గా ప్రదర్చించేలా చర్యలు తీసుకోవాలని, స్టాక్‌ రిజిస్టర్‌, బిల్‌ రిజిస్టర్స్‌ సక్రమంగా నిర్వహించేలా చెక్‌ చేయాలని, విడి విత్తనాలు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని, విత్తనాల ప్యాకెట్లపైన లేబుల్‌ పరిశీలించి గడువు దాటినా విత్తనాలను అమ్మకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలను అమ్మేల చూడాలన్నారు. నకిలీ విత్తనాలపైన రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో సంబంధం ఉన్నవారి పై నిఘా ఉంచాలని సూచించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మేవారిపైన పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు. రైతులు విత్తనాలు కొనే ముందు నాణ్యమైన విత్తనాలు మాత్రమే కొనాలని నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ కేఆర్‌కే. ప్రసాదరావు, జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత, డీఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, ఏడిఏ హుస్సేన్‌బాబు, ఏవో కీర్తి అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.