20, 21న ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు

– కలెక్టర్‌ ప్రియాంక అలా
నవతెలంగాణ-పాల్వంచ
ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో సవరణలు, మార్పులు, తొలగింపుల కోసం భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 20, 21 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహిస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అలా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ప్రియాంక అలా ఐడీఓసీ సమావేశ మందిరంలో మాట్లాడుతూ సవరణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఫిబ్రవరి 8, 2024 వరకు నిర్వహించనున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-2024ను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందని, 18 సంవత్సరాల వయస్సుకు జనవరి 1, 2024ను అర్హత తేదీగా నిర్ధారించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 20, 21 తేదీలలో ప్రత్యేక కార్యక్రమంలో నూతన ఓటరు నమోదు, జాబితా సవరణలో భాగంగా జిల్లాలో 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని చెప్పారు. వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లు ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని, ఎలాంటి పొరపాట్లుకు తావు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు బూత్‌ స్థాయి అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ద్వారా నియమించబడిన ప్రతినిధుల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. బూత్‌ స్థాయి అధికారులు సమయపాలన పాటించాలని, నూతన ఓటరు నమోదు, సవరణలు, తొలగింపుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన 6, 7, 8 దరఖాస్తు ఫారములు బూత్‌ స్థాయి అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్‌ అధికారులు ప్రతీక్‌ జైన్‌, డాక్టర్‌ రాంబాబు, శిరీష, మంగిలాల్‌, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.