ఆనాటి పిల్లల పెంపకం వేరు.. ఈనాటి పిల్లల పెంపకం వేరు. ఆనాటి ఉమ్మడి కుటుంబాలు నేడు ఒంటరి కుటుంబాలు. తాతయ్యలు, అమ్మమ్మలు లేని ఇల్లు ఒంటరిగా మిగిలిపోతోంది. తల్లిదండ్రులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలతో బిజీగా గడుపుతూ పిల్లలకి ఎలాంటి నడవడికలు నేర్పాలి, అన్నం ఎలా తినిపించాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా నేర్పించాలి, నలుగురుకి ఆత్మీయతలు ఎలా పంచాలో తెలపటం లేదు. పిల్లలేమో ఒంటరిగా లాప్టాప్‌లు, సెల్ ఫోన్లతో జీవిస్తున్నారు. ఇలాంటి తల్లిదండ్రులకు నేడు బాలల దినోత్సవం సందర్భంగా నేను చెప్పే ఈ మాటలు ఉపయోగపడతాయని భావిస్తున్నాను.
పిల్లల పెంపకంలో కమ్యూనికేషన్స్ స్కిల్స్ చాలా ముఖ్యం. అమ్మానాన్న ఉద్యోగాలు చేస్తూ తీరికలేకుండా బతికేస్తున్నారు. పిల్లల చేతిలో సెల్‌ఫోన్ పెట్టేసి తమ పని చూసుకుంటున్నారు. ఆ సెల్ ఫోను, టీవీనే తమ ప్రపంచం అనుకుంటున్నారు పిల్లలు. దీని వల్ల నర్సరీలోనో, ఎల్‌కేజీలోనో పిల్లలని జాయిన్ చేసినప్పుడు మిగిలిన పిల్లలతో ఎలా కలవాలో వారికి తెలియటం లేదు. పిల్లలతో కలిసి ఎలా ఆడుకోవాలో తెలియటం లేదు. ఎక్ట్రీమ్‌గా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి పిల్లలని ప్రతి రోజు ఓ గంట పార్కులకు తీసుకెళ్లి వారి వయసున్న పిల్లలతో మాటలు కలుపుతూ ఆడుకునేలా చేయాలి. ప్రతిరోజూ వీలుకాకపోతే కనీసం వారానికి ఒక రోజైనా తీసుకెళ్లాలి.
ఆడించండి పాడించండి
నేటి తరం కాళ్ళకి చెప్పులు లేకుండా నడవటం లేదు. కళ్ళకి అద్దాలు లేకుండా గడవడం లేదు. నీటిలో ఆటలు అసలే లేవు. సూర్య కిరణాలు పసిపిల్లల దేహానికి తగలటం లేదు. ఆకాశాన్ని చూసిన పాపాన పోవటమే లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పసిపిల్లల రేపటి భవిష్యత్తు ఏమవుతుంది? కనుక ప్రతి తల్లి, తండ్రి తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు ఏమిటంటే అప్పుడప్పుడు కాళ్ళకి చెప్పులు లేకుండా కనీసం ఓ 20 నిమిషాలైనా మట్టిలో పిల్లలని నడిపించాలి. టబ్బులో కానీ బకెట్లో కానీ నీరు పోసి ఆ నీటితో 20 నిమిషాలు ఆడించాలి. తర్వాత స్నానం పోయాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంకాలం సూర్య కిరణాలు పిల్లల దేహాన్ని తాకేటట్టుగా బయట ఉంచాలి, ఆడించాలి. ప్రతిరోజూ ఆకాశాన్ని కళ్ళకు అద్దాలు లేకుండా చూపించాలి. నాలుగు గోడల మధ్య ఏసీలో కాకుండా ఆరుబయట 20 నిమిషాలు పిల్లలను చల్లగాలికి తిప్పాలి. స్వచ్ఛమైన గాలి, నీరు పిల్లలకు అందేలా చూడాలి.
ప్రకృతిలో గడపనివ్వండి
ఆకాశం, భూమి, నీరు, గాలి, సూర్య కిరణాలు… వీటితో కనక పిల్లలకి అనుబంధం ఏర్పడితే వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది. లేదంటే పిల్లలు అనేక జబ్బుల బారిన పడతారు. నా కౌన్సెలింగ్‌లో పసిపిల్లలకి కళ్ళు కనిపించకుండా వస్తారు. ప్రకృతి సృష్టించిన రంగులన్నీ మన కళ్ళతో చూడాలి. కొన్ని రంగులు చూడకపోతే రాను రాను కళ్ళ సమస్య ఏర్పడి గుడ్డివాళ్ళం అవుతాం. నిరంతరం ఎక్కువ గ్రావిటీ ఉన్నటువంటి సెల్ ఫోన్, ల్యాప్టాప్‌లను స్క్రీన్ మీద చూడటం వల్ల కళ్లజబ్బులు, చెవులు వినపడకపోవటం జరుగుతున్నాయి. కనుక తల్లిదండ్రులు ఈ చిన్న సూచనలను పాటించి మన పిల్లల్ని ప్రకృతి ఒడిలో ఆడుకునేలా చేయాలి. వారి రేపటి భవిష్యత్తు అందంగా తీర్చిదిద్దాలి. పిల్లలు ప్రకృతితో గడిపేలా చేయడం వల్ల ఖర్చు అయ్యేది ఏమీ లేదు. కానీ మీ పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా చక్కగా ఎదుగుతారు. వారి మానసిక ప్రవృత్తిలో చాలా మార్పు వస్తుంది. ఈ విషయాన్ని నేను ప్రాక్టికల్‌గా చెబుతున్నాను. నేటి బాలలే రేపటి పౌరులు. ఆడుదాం పాడుదాం. అల్లరి చేసేద్దాం. నవ్వుతూ నవ్విస్తూ నలుగురిలో జీవించేద్దాం.
ఒంటరిగా వదలొద్దు
పిల్లల్ని ఒంటరిగా వదిలి పెట్టినప్పుడు ఒంటరితనానికి అలవాటు పడిపోయి ఆటిజం వస్తోంది. ఇటీవల ఆటిజం కేసులు పెరుగుతున్నాయి. అలాగే హైపర్ యాక్టివ్‌నెస్ కూడా చాలా పెరుగుతుంది. దీనికి కారణం వారు ఒంటరిగా జీవించడమే. పసి మనసులకు ఆత్మీయత, ప్రేమ, అక్కున చేర్చుకునే భావన చాలా ముఖ్యం. పని ఒత్తిడితో తల్లిదండ్రులు ఒకరినొకరు దూషించుకోవడం, తిట్టుకోవడం, మాట్లాడుకోకపోవటం, వారి కోపాన్ని పసిపిల్లల మీద చూపించడం వల్ల వారిలో హైపర్ యాక్టివ్‌నెస్ పెరిగి అది ఆటిజంకు దారి తీస్తోంది. ఇది ప్రస్తుత పరిస్థితుల ద్వారా వస్తున్నదే కానీ జీన్స్ వల్ల కాదు. కనుక తల్లిదండ్రులు మీ పిల్లలకు ఆత్మీయతలను, ప్రేమను పంచి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దండి. రేపటి తరానికి ఆరోగ్యవంతమైన పిల్లలను అందివ్వండి. కుటుంబం అనేది చాలా గొప్ప వ్యవస్థ. అందులో ఆనందం అనుభవిస్తే కానీ తెలియదు. అందుకే కుటుంబ వ్యవస్థను పటిష్టం చేద్దాం.
పిల్లల పెంపకంలో కొన్ని ముఖ్యమైన అంశాలు
– ప్రేమ-ఆత్మీయత: పిల్లలకు ప్రేమ, ఆత్మీయత చాలా అవసరం. వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రేమతో కూడిన వాతావరణాన్ని అందించాలి. అప్పుడే పిల్లలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు.
– కమ్యూనికేషన్: పిల్లలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి తల్లిదండ్రులు వారితో సంభాషించడం, వారు చెప్పేది ఓపిగ్గా వినడం, వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా ముఖ్యం.
– సమయం: పిల్లలతో గడిపే సమయం చాలా విలువైంది. పనుల ఒత్తిడితో వారితో తక్కువ సమయం గడిపినా నాణ్యమైన సమయం కేటాయించండి.
– మార్గదర్శకత్వం: పిల్లలు సరైన మార్గంలో పెరగడానికి వారికి సరైన మార్గదర్శకత్వం అవసరం.
– ధైర్యం: పిల్లలు ప్రతి విషయానికి భయపడకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండేలా తీర్చిదిద్దాలి.
– – డాక్టర్ లక్కరాజు నిర్మల