– ఎనిమిది బ్యాండ్‌ల విక్రయం
– టెలికం శాఖ వెల్లడి
న్యూఢిల్లీ : మరోమారు స్పెక్ట్రం వేలానికి టెలికం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే మే 20 నుంచి ఎనిమిది బ్యాండ్‌ల కోసం స్పెక్ట్రం వేలం ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనే టెలికం కంపెనీల నుంచి దరఖాస్తులను అహ్వానించనున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డిఒటి) శుక్రవారం తెలిపింది. వచ్చే సోమవారం నుంచే దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు ఏప్రిల్ 22ను చివరి తేదీగా నిర్ణయించింది. ప్రాసెసింగ్ ఫీజు ధరను రూ.1లక్షగా నిర్ణయించింది. అన్ని రకాల బ్యాండ్లలో 10,523.15 మెగాహెర్డ్జ్ స్పెక్ట్రమ్‌ను రూ.96,317.65 కోట్ల రిజర్వ్ ధరతో వేలం వేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత సారి విక్రయించబడని అన్ని స్పెక్ట్రమ్‌లు మళ్లీ బిడ్డింగ్‌కు సిద్ధంగా ఉంటాయి. 800, 900, 1800, 2100, 2300, 2500, 3300 ఎంహెచ్‌జడ్, 26 జిహెచ్‌జడ్ బ్యాండ్‌లలోని ఎయిర్‌వేవ్‌లు, వాయిస్, డేటా స్పెక్ట్రమ్ అధిక భాగాన్ని కవర్ చేస్తూ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కాగా.. మే 6న బిడ్డర్ల ప్రీ క్వాలిఫికేషన్, మే 9న తుది బిడ్డర్ల జాబితాను వెల్లడించనున్నారు. మే 13, 14 తేదీల్లో మాక్ వేలం ఉంటుందని డాట్ నోటీసులో పేర్కొంది.
ప్రీక్వెన్సీ అసైన్‌మెంట్ తేదీ నుండి 20 సంవత్సరాల పాటు స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకునే హక్కు టెలికాం కంపెనీలకు ఉంటుంది. యూనిఫైడ్ యాక్సెస్ లైసెన్స్ (యుఎఎల్)ని కలిగి ఉన్న లేదా స్వీకరించడానికి షరతులను కలిగి ఉన్న అన్ని సంస్థలు వేలంలో పాల్గొనవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన, లైసెన్స్‌లు వైర్డు, వైర్‌లెస్ టెక్నాలజీలు ఒకే బలమైన నెట్‌వర్క్‌గా కలిసి పని చేయడానికి అనుమతిస్తున్నట్లు డిఒటి పేర్కొంది. టెలీకాం రంగంలోకి కొత్తగా ప్రవేశించినవారు కూడా ఒక్కో లైసెన్స్ సర్వీస్ ఏరియాకు రూ. 100 కోట్ల నికర విలువను చూపవలసి ఉంటుంది.
స్పెక్ట్రం లైసెన్స్‌లను భారతీయ సంస్థలకు మాత్రమే ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది. విదేశీ దరఖాస్తుదారులు దానిని పొందేందుకు భారతీయ కంపెనీని ఏర్పాటు చేయవచ్చు. విదేశీ సంస్థలు నేరుగా వేలంలో పాల్గొనడానికి, భారతీయ కంపెనీ ద్వారా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడతాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం ఈక్విటీ వాటాను కలిగి ఉంటారు. భారత్‌తో భూ సరిహద్దును పంచుకునే దేశాల నుంచి పెట్టుబడులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇంతక్రితం 2022 ఆగస్ట్‌లో స్పెక్ట్రం వేలం జరిగింది. ఇందులో ముఖ్యంగా 5జిని విక్రయానికి పెట్టింది. బిడ్డింగ్‌కు పెట్టిన దానిలో 71 శాతం వేలం ద్వారా విక్రయించగా కేంద్రానికి రూ.1.5 లక్షల కోట్లు సమకూరింది.