పిలుపందిందో లేదో
అప్పటి యవ్వనాన్ని
హడావిడిగా పులుముకున్నాం
హదయంలోనే కాదు
తల మీద నెరసిన జుట్టుకు కూడా!
సడలిన కీళ్ళకు ఉత్సాహపు మలామును రుద్ది
వడి వడిగా ప్రాంగణాన్ని చేరుకున్నాం
జ్ఞాపకాల దొంతరలను చీల్చి
ఆనవాళ్ళు పోల్చుకున్నాం
ఆలింగనాలూ, రెడ్ శాల్యూట్ లు
కరచాలనాలు, కవ్వింతల కబుర్లూ
ఒకటా రెండా… ఎన్నెన్ని ప్రవాహాలో…
మున్నేట్లో మునకలేసినట్లు
తల్లి గోదాట్లో ఈదులాడినట్లు
అప్పటి గాయాల మచ్చల్ని తడిమే వారొకరు
గేయాల నాదాల్ని శతి చేసే వారింకొకరు
రోడ్డుపై నినాదమై మోగిన కంఠాల్ని
జైలు ఊచల వెనుక చెలరేగిన
ఉద్విఘ్న భావాల్ని
ఎన్ని మందారాల్ని పరచారని
ఎన్నెన్ని తూర్పు రేకల్ని విప్పి చూపారని
అప్పట్లో పోస్టరై గోడ మీద వెలిగిన వాడొకడు
ఇప్పుడు కవిత్వపు కుప్పై తారసపడ్డాడు
జాజి రంగై గోడపై మెరిసినవాడు
ఆర్టిస్ట్‌గా లోకానికి రంగులద్దుతున్నాడు
కరపత్రాల కత్తులు దూసిన వాళ్ళు
అక్షరాల మాంత్రికులై
పత్రికలను శాసిస్తున్నారు
కంజర పట్టుకు పాటకు దరువేసిన వాడు
వాగ్గేయకారుడై జనం ఘోషను
గేయంగా ఆలపిస్తున్నాడు
అప్పటి కూనిరాగాల కోకిలమ్మ
సినీ రాగాల కల్పవల్లిగా
హదయాల్ని మీటుతోంది
అప్పటి మరకతాలన్నీ
ఎన్ని మాణిక్యాలుగా మెరిశాయో
జీవితమంతా జనం గొంతుకలుగా
నిలిచిన వాళ్లు
అరుణ పతాకలై పోరుబాటలో నడచిన వాళ్లు
బతుకు పయనంలో సాగుతూనే
ఆశయాల జెండా నొదలని వాళ్ళు
ఇప్పటికీ జ్ఞాన ప్రవాహాలే
రగులుతున్న నిప్పు కణికలే
ఎన్ని సంగమాల కూడలి ఇదని
ఎన్ని ప్రతినల, మరెన్ని పిడికిళ్ళ
మండే గుండెల, రగిలే మెదళ్ళ
జ్వాజలా మానపు నెగడు ఇదని
అంటే
అధ్యయనాన్ని, పోరాటాన్ని కలగలిపి
నడిపించిన తారక కదా!
బతుకు మార్గం చూపిన వేగు చుక్క సదా!
(ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనం పంచిన జ్ఞాపకాలమాల)
– వి.ఆర్. తూములూరి