జాతీయ రహదారుల నిర్మాణంలో వేగం పెంచండి

Speed ​​up construction of national highways– సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేండ్లలో జాతీయ రహదారుల నిర్మాణాల గురించి పట్టించుకోక పోవడంతో అభివద్ధి కుంటుపడిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో రహదారులపై ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్ష చేశారు. విజయవాడ- నాగ్‌పూర్‌ సెక్షన్‌ (ఎన్‌.హెచ్‌.-163జీ) కి సంబంధించి నాలుగు వరుసలుగా నిర్మిస్తున్న ఎన్‌.హెచ్‌.-163జీ గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారికి సంబంధించి 8 ప్యాకేజీలు అవార్డు అయ్యాయని మంత్రి చెప్పారు. 300 కిలోమీటర్లున్న ఈ రహదారిని మెగా ఇంజినీరింగ్‌ సంస్థ నిర్మిస్తున్నదన్నారు. భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందుల దష్ట్యా నిర్మాణ సంస్థ పనులు చేయడంలో జాప్యం జరుగుతోందని ఎన్‌హెచ్‌ఏఐ ఆర్‌ఓ శివశంకర్‌, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నాగేశ్వర్‌రావు మంత్రి దష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి మెగా సంస్థ యాజమాన్యంతో మాట్లాడి భూసేకరణకు ఇబ్బందులు లేనిచోట, ఇప్పటికే భూసేకరణ చేసిన ప్రాంతాల్లో పనులు మొదలు పెట్టాలని చెప్పారు. త్వరలోనే మంచిర్యాల, వరంగల్‌, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి భూసేకరణను వేగవంతం చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ – డిండి (ఎన్‌.హెచ్‌. 765) కి సంబంధించి 85 కిలోమీటర్లున్న రహదారి పనుల అలైన్‌మెంట్‌ కాపీని అధికారులు మంత్రికి సమర్పించారు. రెండు వరుసల నుంచి నాలుగు వరుసలకు అప్‌గ్రేడ్‌ చేస్తున్న ఈ బ్రౌన్‌ ఫీల్డ్‌ రహదారిపై ఒకటి రెండ్రోజుల్లో ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి అలైన్‌మెంట్‌ను ఖరారు చేస్తామన్నారు. వెంటనే డీపీఆర్‌ సిద్ధం చేసి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఖమ్మం – దేవరపల్లి (ఎన్‌.హెచ్‌.365జీజీ) గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారికి సంబంధించి నాలుగు వరుసలుగా నిర్మిస్తున్న రహదారి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను ప్రతీరోజు పరీక్షించాలని చెప్పారు. ఏదైనా నాణ్యతాలోపం ఉంటే సంబంధిత సంస్థపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 90 కిలోమీటర్లున్న ఈ రహదారి పనులు ఇప్పటికే 60 శాతం నుంచి 70 శాతం పూర్తయ్యాయని మంత్రికి వివరించిన అధికారులు.. అందుకు సంబంధించిన ఫొటోలనూ చూపించారు. 2025 మే లేదా జూన్‌ కల్లా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు తేల్చిచెప్పారు. ఆరు వరుసలుగా నిర్మిస్తున్న.. కర్నూల్‌ – రాయచూర్‌ (ఎన్‌.హెచ్‌-150సీ) గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి పనులు రెండు ప్యాకేజీలుగా జరుగుతున్నాయన్నారు. ఇందులో ఒక ప్యాకేజీ 38 కిలోమీటర్లు కాగా మరో ప్యాకేజీ 38 కిలోమీటర్లుగా ఉందని చెప్పారు. మొదటి ప్యాకేజీ పనులు వచ్చే టన్నెళ్ల వంటి నిర్మాణాలు ఉన్నాయనీ, ఈ పనులు 2025 డిసెంబర్‌ కల్లా పూర్తవుతాయని వివరించారు. ఇక హైదరాబాద్‌ మన్నెగూడ జాతీయ రహదారి పనులకు సంబంధించిన రివ్యూలో.. కొంత బ్రౌన్‌ ఫీల్డ్‌, మరికొంత గ్రీన్‌ఫీల్డ్‌గా 45 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న హైదరాబాద్‌ – మన్నెగూడ (ఎన్‌.హెచ్‌-163) రహదారి పనులు అవార్డు అయ్యాయనీ, 15 రోజుల క్రితం పనులు ప్రారంభించిన విషయం మంత్రి దష్టికి తీసుకువచ్చారు. రెండు వరుసల నుంచి నాలుగు వరుసలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్న ఈ రహదారిపై అనేక ప్రమాదాలు జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌- నాగ్‌పూర్‌ (ఎన్‌.హెచ్‌ 44)కు సంబంధించిన పనుల పురోగతిపై అధికారులను ఆరా తీసిన మంత్రి 17 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లున్న రెండు ప్యాకేజీల గురించి, హైదరాబాద్‌-బెంగళూర్‌ (ఎన్‌.హెచ్‌ 44) జాతీయ రహదారి పరిధిలో 12 కిలోమీటర్లున్న మూడో ప్యాకేజీ పనులు ఎక్కడి వరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ – విజయవాడ (ఎన్‌.హెచ్‌-65) పై బ్లాక్‌ స్పాట్ల పనులు జరుగుతున్నాయనీ, వాటిని పూర్తి చేయడానికి ఇంకా రెండు సంవత్సరాల కాలపరిమితి ఉందని అధికారులు మంత్రి దష్టికి తీసుకురాగా రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు.