నల్గొండ బైపాస్, ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయండి..

Speed ​​up Nalgonda Bypass, RRR road construction works..– రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి జైన్ కి విజ్ఞప్తి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు ఎస్ఆఫ్ సీ (స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ) మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు పిలవాలని కోరిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలోని జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి  అనురాగ్ జైన్ ను కలిసి నేషనల్ హైవే రోడ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.  నల్గొండ బైపాస్ నిర్మాణంపై వారంలో ఎస్ఎఫ్ సీ ఏర్పాటుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.  రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఆర్ఆర్ఆర్(రీజినల్ రింగ్ రోడ్డు) పనులను వేగవంతం చేయడంతోపాటు, నల్గొండ బైపాస్ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని  ఢిల్లీలోని మోర్త్ కార్యాలయంలో అనురాగ్ జైన్ ను కలిసిన మంత్రి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న వివిధ రోడ్ల నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిన తరుణంలో టెండర్లు పిలిచి పనులను ప్రారంభించేందుకు కావల్సిన అనుమతులను మంజూరీ చేయాలని మంత్రి అభ్యర్దించారు. అంతేకాదు నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు ఎస్ఆఫ్ సీ (స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ) మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు పిలవాలని కోరిన మంత్రి.. నల్గొండ టౌన్  పరిధిలోని నేషనల్ హైవే -565పై వివిధ పాఠశాలల్లో చదివే పిల్లలు ఎఫ్ఓబీ లేకపోవడంతో ప్రమాదాలబారిన పడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెక్రెటరీ అనురాగ్ జైన్ దృష్టికి తీసుకువచ్చారు. ఇదే విషయంపై పాఠశాల విద్యార్ధులు ప్రధానమంత్రి కార్యాలయానికి సైతం విజ్ఞప్తులు చేశారని,  పీఎంఓ సైతం పరిస్థితిని చక్కదిద్దాలని కోరిందనారు.  దాన్లో భాగంగా రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ రూ. 9 కోట్లతో ఎఫ్ఓబీని ఏర్పాటు చేసేందుకు అంచనాలను రూపొందించిందని వివరించారు. ఎస్ఎఫ్ సీ సమావేశం నిర్వహించి టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తే.. ఈ పనులన్నీ పూర్తవుతాయని ఆయన కార్యదర్శి అనురాగ్ జైన్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన అనురాగ్ జైన్ వారం రోజుల్లో ఎస్ఎఫ్ సీ ప్రక్రియను ప్రారంభిస్తామని హామి ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ & బీ స్పెషల్ సెక్రెటరీ  దాసరి హరిచందనతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.