
– పానీపూర క్లస్టర్ ఎస్ పి హెచ్ ఓ డాక్టర్ మల్లీశ్వరి
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలను ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పాటించాలని పాణిపుర క్లస్టర్ ఎస్ పి హెచ్ ఓ డాక్టర్ మల్లీశ్వరి అన్నారు. శనివారం హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డి ఎం హెచ్ ఓ ఆదేశాలతో పానీపూర క్లస్టర్ పరిధిలోని ప్రైవేట్ ఆస్పత్రులు బేగంబజార్ దీప ఆసుపత్రి, కిషోర్ చంద్రన్ ఐ ఆసుపత్రి, మచ్చి మార్కెట్ వద్ద ఉన్న చందన నర్సింగ్ హోమ్, మెడ్ కేర్ ఆస్పత్రి, మిడ్ లైఫ్ ఆస్పత్రి, పురానాపూల్ లైఫ్ స్ప్రింగ్ మెటర్నిటీ ఆసుపత్రి లను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రైవేట్ ఆసుపత్రుల కు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలన్నారు. లేనిపక్షంలో ఆ హాస్పిటల్స్ యాజమాన్యం పై, వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రులు వారు వారి వారి సెంటర్లలో వసూలు చేస్తున్న ఫీజుల వివరములు తప్పనిసరిగా తెలుగు, ఇంగ్లీష్ భాషలో రిసెప్షన్ నందు బోర్డులు ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు. రోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రులలో పరిశుభ్రత, సౌకర్యాలు అందించే విషయంలో ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వైద్యులు వారి రిజిస్ట్రేషన్ నంబర్లు, వారి వారి విద్యార్హతలు కూడా రిసెప్షన్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డుపై ప్రదర్శించాలని ఆసుపత్రి యాజమాన్యాలకు సూచించారు. ప్రతి ఆసుపత్రి, నర్సింగ్ హోమ్ లలో అధిక ఫీజులు వసూలు చేయాలన ఆశతో అనవసరంగా సి-సెక్షన్ కాన్పులు చేస్తే వైద్య అధికారులు చర్యలు తీసుకుంటారు అన్నారు. అనవసరంగా సి సెక్షన్ చేసిన హాస్పిటల్స్ పై చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే వైద్యం అందించాలన్నారు.రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేకుండా అర్హత లేని డాక్టర్లు వైద్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఆసుపత్రి వారు వచ్చిన జబ్బుల గురుంచి పేషెంట్లకు తప్పనిసరిగా వారికీ అర్ధమయ్యే భాషలో వివరించాలని, జబ్బుకు అయ్యే ఖర్చులని కూడా ముందుగానే పేషెంట్ కు వివరించాలని సూచించారు. ఆసుపత్రులకు ఫైర్ సేఫ్టీ ఉండాలని తెలిపారు. వైద్య శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులకు సూచించారు. ఈ తనిఖీలలో బేగంబజార్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్, కార్వాన్ టు ఇంచార్జ్, మహారాజ్ గంజ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్ చందర్, పానీపూర క్లస్టర్ డిఓ శివ, కార్వాన్ టు ఎఎన్ఎం రూపారాణి, ఫైర్ ఆఫీసర్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.