చిందేసిన శ్రీలంక

Spilled Sri Lanka– 27 ఏండ్ల తర్వాత భారత్‌ పై వన్డే సిరీస్‌ విజయం
– మూడో వన్డేలో 110 పరుగుల తేడాతో గెలుపు
నవతెలంగాణ-కొలంబో : శ్రీలంక చిందేసింది. 27 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం భారత్‌పై వన్డే సిరీస్‌ విజయం సాధించింది. చివరగా 1997 ఆగస్టులో టీమ్‌ ఇండియాపై సిరీస్‌ గెలుపొందిన లంకేయులు.. మళ్లీ ఇన్నాండ్లకు కొలంబోలో 2024 ఆగస్టులో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. బుధవారం జరిగిన మూడో వన్డేలో ఆతిథ్య శ్రీలంక 110 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 249 పరుగుల ఛేదనలో భారత్‌ 26.1 ఓవర్లలోనే 138 పరుగులకు కుప్పకూలింది. తొలుత శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. తొలి వన్డే టైగా ముగియగా.. చివరి రెండు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. 2-0తో వన్డే సిరీస్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. అవిష్క ఫెర్నాండో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా, డ్యునిత్‌ వెల్లలాగె ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచారు.
స్పిన్‌కు విలవిల : 249 పరుగుల ఛేదనలో భారత్‌ తేలిపోయింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (35, 20 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే రాణించాడు. పవర్‌ప్లేలో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. శుభ్‌మన్‌ గిల్‌ (6), విరాట్‌ కోహ్లి (20), రిషబ్‌ పంత్‌ (6), శ్రేయస్‌ అయ్యర్‌ (8), అక్షర్‌ పటేల్‌ (2), రియాన్‌ పరాగ్‌ (15), శివం దూబె (9)లు విఫలమయ్యారు. ఆఖర్లో వాషింగ్టన్‌ సుందర్‌ (30) భారత్‌కు మూడెంకల స్కోరు అందించాడు. శ్రీలంక స్పిన్నర్లలో డ్యునిల్‌ వెల్లలాగె (5/27) ఐదు వికెట్లతో మాయజాలం చేశాడు. జెఫ్రీ (2/34), మహీశ్‌ తీక్షణ (2/45) రెండేసి వికెట్లు పడగొట్టారు. స్పిన్‌కు దాసోహమైన భారత బ్యాటర్లు 26.1 ఓవర్లలోనే చేతులెత్తేశారు.