పుణెలో స్పిన్‌ సవాల్‌

Spin challenge in Pune– సిద్ధం కానున్న ర్యాంక్‌ టర్నర్‌
నవతెలంగాణ-పుణె
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసు ఆసక్తికరంగా మారింది. బెంగళూర్‌ టెస్టులో టీమ్‌ ఇండియా ఊహించని పరాజయం చవిచూసినా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతుంది. కానీ ఫైనల్‌ బెర్త్‌ రేసులో భారత్‌కు ప్రత్యర్థి జట్ల నుంచి గట్టి పోటీ నెలకొంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సహా శ్రీలంక టాప్‌-2లో నిలిచేందుకు తహతహ లాడుతున్నాయి. తాజా డబ్లూటీసీ సైకిల్‌లో భారత్‌ మరో ఏడు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం నాలుగు మ్యాచుల్లో విజయాలు సాధించి, మిగతా టెస్టులను డ్రా చేసుకుంటేనే భారత్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. లేదంటే, ఇతర జట్ల సిరీస్‌ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా, శ్రీలంక రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ ఫలితంతో సమీకరణంపై మరింత స్పష్టత రానుంది. నవంబర్‌ ఆఖర్లో బోర్డర్‌ గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ ఆరంభం నాటికి డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో ఎవరెక్కడ ఉన్నారనే అంశంపై స్పష్టత ఉండనుంది. అయితే, స్వదేశంలో చివరి రెండు టెస్టులో కచ్చితంగా విజయం సాధిస్తేనే భారత్‌ అవకాశాలు మరింత మెరుగవుతాయి. బెంగళూర్‌ టెస్టు చేజారటంతో రోహిత్‌సేన ఒత్తిడిలో పడింది. దీంతో న్యూజిలాండ్‌తో చివరి రెండు టెస్టు వేదికలు పుణె, ముంబయి పిచ్‌ రూపకల్పన విషయంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఆతిథ్య జట్టుకు ఉపయుక్తమైన స్పిన్‌ స్వర్గధామ పిచ్‌ను సిద్ధం చేయాలనే మౌళిక ఆదేశాలు క్యూరేటర్లకు అందినట్లు సమాచారం.
స్పిన్‌ పిచ్‌
భారత్‌, న్యూజిలాండ్‌ రెండో టెస్టుకు పుణె వేదికగా నిలువనుంది. ఈ నెల 24 నుంచి కీలక రెండో టెస్టు ఆరంభం కానుంది. పుణెలో ఇది మూడో టెస్టు పోరు కానుండగా.. గత రెండు మ్యాచుల్లో ఆతిథ్య జట్టు మిశ్రమ ఫలితాలు సాధించింది. ఆసీస్‌ చేతిలో ఓటమి ఎదురవగా, సఫారీపై ఇన్నింగ్స్‌ విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై విరాట్‌ కోహ్లి ఇక్కడ ద్వి శతకం సాధించటం భారత్‌కు ఉత్తేజాన్ని అందించే అంశం. పుణెలో సహజంగా ఎర్రమట్టి చేసిన పిచ్‌ అందుబాటులో ఉంది. సాధారణంగా ఈ వికెట్‌ స్పిన్‌కు అనుకూలం. రెండో టెస్టులో తొలి గంట మినహా పేసర్లకు పిచ్‌ నుంచి పెద్దగా సహకారం లభించకపోవచ్చు. తొలి రోజు రెండో సెషన్‌ నుంచే స్పిన్నర్లు ప్రభావశీలంగా మారనున్నారు. మూడో టెస్టు వేదిక ముంబయిలో ఎర్రమట్టి చేసిన పిచ్‌లు ఉన్నాయి. అయినా, అక్కడా స్పిన్‌ను అనుకూలంగా ఉండేలా క్యూరేటర్‌ ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. అశ్విన్‌, జడేజా సహా కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ జట్టులో ఉన్నప్పటికీ సెలక్షన్‌ కమిటీ ఐదో స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను జట్టులోకి తీసుకుంది. దీంతో భారత స్పిన్నర్ల బలాలకు అనుకూలంగా పిచ్‌పై ఎంపిక చేసిన ప్రదేశాల్లో వాటరింగ్‌ చేయటం వంటివి చేసేందుకు క్యూరేటర్లు సిద్ధమతున్నారని చెప్పవచ్చు.