– తొలి రోజు ఆటలో 14 వికెట్లు
– రవీంద్ర జడేజా ఐదు వికెట్ల మాయ
– న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 235/10
– భారత్ తొలి ఇన్నింగ్స్ 86/4
వాంఖడెలో తొలి రోజు నుంచే స్పిన్ మాయ మొదలైంది. ఇటు రవీంద్ర జడేజా (5/65), వాషింగ్టన్ సుందర్ (4/81).. అటు అజాజ్ పటేల్ (2/33) మ్యాజిక్‌తో మెరవటంతో మూడో టెస్టు తొలి రోజు ఆటలోనే ఏకంగా 14 వికెట్లు కుప్పకూలాయి. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు కుప్పకూలగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 86/4తో పోరాడుతోంది.
నవతెలంగాణ-ముంబయి
స్పిన్ మాయకు బ్యాటర్లు విలవిల్లాడారు. వాంఖడె ఎర్రమట్టి పిచ్‌పై తొలి రోజు ఆటలోనే స్పిన్నర్లు వికెట్ల జాతర సాగించారు. భారత స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా (5/65), వాషింగ్టన్ సుందర్ (4/81) మాయ చేయగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే చేతులెత్తేసింది. డార్లీ మిచెల్ (82, 129 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విల్ యంగ్ (71, 138 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (30, 52 బంతుల్లో 4 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (31 నాటౌట్, 38 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 86/4తో కొనసాగుతుంది. విరాట్ కోహ్లి (4), మహ్మద్ సిరాజ్ (0), రోహిత్ శర్మ (18) నిరాశపరిచారు. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ (2/33) రెండు వికెట్లతో మెరిశాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో మరో 149 పరుగుల వెనుకంజలో నిలిచింది.
మిచెల్, యంగ్ జోరు
టాస్ నెగ్గిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఆ జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. డెవాన్ కాన్వే (4) ఆరంభంలోనే నిష్క్రమించాడు. విల్ యంగ్ (71), టామ్ లేథమ్ (28) రెండో వికెట్‌కు మంచి భాగస్వామ్యం నమోదు చేశారు. రచిన్ రవీంద్ర (5)ను సుందర్ అవుట్ చేసినా.. విల్ యంగ్, డార్లీ మిచెల్ (82) జోడీ భారత బౌలర్లను విసిగించింది. అర్థ సెంచరీలు బాదిన యంగ్, మిచెల్ న్యూజిలాండ్‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. కానీ రెండు సార్లు ఒకే ఓవర్లో రెండేసి వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా.. కివీస్ ఇన్నింగ్స్‌ను శాసించాడు. ఈ ఇద్దరు మినహా కివీస్ నుంచి ఎవరూ భారత బౌలర్లను ఎదుర్కొలేకపోయారు. 65.4 ఓవర్లలో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయ్యింది.
ఆ ఇద్దరు మెరిసినా
తొలి రోజు 19 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన భారత్ ఆఖర్లో ఇక్కట్లో పడింది. రోహిత్ శర్మ (18, 18 బంతుల్లో 3 ఫోర్లు) దూకుడుగా ఆడుతూ వికెట్ కోల్పోయినా.. యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (30), శుభ్‌మన్ గిల్ (31 నాటౌట్) రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నిర్మించారు. మరో రెండు ఓవర్లలో తొలి రోజు ఆట ముగియనుండగా.. భారత్ ఏకంగా మూడు వికెట్లు చేజార్చుకుంది. యశస్వి జైస్వాల్‌ను అజాజ్ పటేల్ అవుట్ చేయగా.. అదే ఓవర్లో నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన మహ్మద్ సిరాజ్ (0) సైతం నిష్క్రమించాడు. విరాట్ కోహ్లి (4) లేని పరుగు కోసం ప్రయత్నించి చేజేతులా రనౌట్ అయ్యాడు. 78/1తో మెరుగ్గా కనిపించిన టీమ్ ఇండియా.. 84/4తో ఒత్తిడిలో పడింది. గిల్‌కు తోడుగా రిషబ్ పంత్ (1 నాటౌట్) అజేయంగా క్రీజులో నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ (2/33) రెండు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. మాట్ హెన్రీ (1/15) ఓ వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ మరో 149 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : టామ్ లేథమ్ (బి) వాషింగ్టన్ సుందర్ 28, డెవాన్ కాన్వే (ఎల్బీ) ఆకాశ్ దీప్ 4, విల్ యంగ్ (సి) రోహిత్ (బి) జడేజా 71, రచిన్ రవీంద్ర (బి) వాషింగ్టన్ సుందర్ 5, డార్లీ మిచెల్ (సి) రోహిత్ (బి) వాషింగ్టన్ 82, టామ్ బ్లండెల్ (బి) జడేజా 0, గ్లెన్ ఫిలిప్స్ (బి) జడేజా 17, ఇశ్ సోధి (ఎల్బీ) జడేజా 7, మాట్ హెన్రీ (బి) జడేజా 0, అజాజ్ పటేల్ (ఎల్బీ) వాషింగ్టన్ 7, విలియం ఓరౌర్క్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (65.4 ఓవర్లలో ఆలౌట్) 235.
వికెట్ల పతనం : 1-15, 2-59, 3-72, 4-159, 5-159, 6-187, 7-210, 8-210, 9-228, 10-235.
బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ 6-0-16-0, ఆకాశ్ దీప్ 5-0-22-1, రవిచంద్రన్ అశ్విన్ 14-0-47-0, వాషింగ్టన్ సుందర్ 18.4-2-81-4, రవీంద్ర జడేజా 22-1-65-5.
భారత్ తొలి ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ (బి) అజాజ్ 30, రోహిత్ శర్మ (సి) లేథమ్ (బి) హెన్రీ 18, శుభ్‌మన్ గిల్ నాటౌట్ 31, మహ్మద్ సిరాజ్ (ఎల్బీ) అజాజ్ 0, విరాట్ కోహ్లి (రనౌట్) 4, రిషబ్ పంత్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 2, మొత్తం : (19 ఓవర్లలో 4 వికెట్లకు) 86.
వికెట్ల పతనం : 1-25, 2-78, 3-78, 4-84.
బౌలింగ్ : మాట్ హెన్రీ 5-1-15-1, విలియం ఓరౌర్క్ 2-1-5-0, అజాజ్ పటేల్ 7-1-33-2, గ్లెన ఫిలిప్స్ 4-0-25-0, రచిన్ రవీంద్ర 1-0-8-0.