– ఇంగ్లాండ్, భారత్ క్రికెటర్ల ముమ్మర సాధన
ధర్మశాల: భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టుకు ధర్మశాలలో సైతం ‘స్పిన్ పిచ్’ సిద్ధమవుతోంది. 3-1తో సిరీస్ టీమ్ ఇండియా సొంతమైనా.. రోహిత్, ద్రవిడ్ ద్వయం ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇచ్చే ఆలోచనలో లేరు. దీంతో ధర్మశాలలో ఊరట విజయంపై కన్నేసిన ఇంగ్లాండ్‌కు ఇది కాస్త మింగుడు పడని వార్తే. సహజంగా ధర్మశాల పిచ్ పేసర్లకు అనుకూలం. కానీ 2022లో ఇక్కడ పిచ్‌ను కొత్తగా తయారు చేశారు. అప్పట్నుంచి ఇక్కడ స్వల్ప స్కోర్లు నమోదవుతున్నాయి. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 288 పరుగులు. వారం రోజులుగా ఇక్కడ వర్షం, మంచుతో పిచ్ రూపకల్పన సాధ్యపడలేదు. క్యూరేటర్, మైదాన సిబ్బంది ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో పిచ్‌పై పని చేస్తున్నారు. ఇక భారత్, ఇంగ్లాండ్ క్రికెటర్లు మంగళవారం ధర్మశాల స్టేడియంలో ముమ్మర సాధన చేశారు. ఇరు జట్ల నుంచి వందో టెస్టుకు సిద్ధమవుతున్న అశ్విన్, బెయిర్‌స్టోలు ప్రాక్టీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, రజత్ పాటిదార్, జశ్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్ సహా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్ నుంచి ఒలీ పోప్, ఒలీ రాబిన్‌సన్, బెన్ స్టోక్స్, మార్క్‌వుడ్, జేమ్స్ అండర్సన్, జో రూట్ సాధన చేశారు.
ఛేదనకు చాన్స్?
భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో ఛేదన అందని ద్రాక్షగా మిగిలింది. లక్ష్యాలను ఛేదించటంలో భారత్, ఇంగ్లాండ్ విఫలమయ్యాయి. స్పిన్ పిచ్‌లు, నాల్గో రోజు ఆటలో పిచ్ పగుళ్లతో పరుగుల వేట గగనమైంది. కానీ ధర్మశాల పిచ్ ఛేదనకు అనుకూలమని చెప్పవచ్చు!. పిచ్ స్వభావ రీత్యా స్పిన్నర్లకు అనుకూలించినా.. ఇక్కడ శీతల వాతావరణం పిచ్‌పై పగుళ్లను ఏర్పడకుండా చేస్తుంది. దీంతో బంతిపై మెరుపు పోగానే బ్యాటర్లకు, స్పిన్నర్లకు పిచ్ నుంచి సహకారం లభించనుంది. భారత స్పిన్నర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో మాయ చేస్తుండగా, ఇంగ్లాండ్ స్పిన్నర్లు తికమక పడుతున్నారు. తొలి రోజు ఉదయం సెషన్లో పేసర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉన్నప్పటికీ.. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం లేకపోలేదు!.