– స్పిన్ పిచ్‌లతో భారత్‌కు ఎదురుదెబ్బ
– అనుకూల పిచ్‌ల పైనా పసలేని స్పిన్నర్లు
సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు అనుకూల పరిస్థితులు కోరుకోవటం పరిపాటి. ఆసీస్ పేస్, ఇంగ్లాండ్ స్వింగ్ పిచ్‌లను తయారు చేసినట్టే భారత్ స్పిన్ పిచ్‌లను సిద్ధం చేయటం సహజం. మూడో రోజు ఆట నుంచి పిచ్ స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌లపై భారత్ జైత్రయాత్ర సాగించగా.. తొలి రోజు నుంచే స్పిన్ మాయ మొదలైతే భారత్‌కు భంగపాటు తప్పటం లేదు. స్పిన్ స్వర్గధామ పిచ్‌లు టీమ్ ఇండియా సొంతగడ్డ అనుకూలతను తగ్గిస్తున్నాయి.
నవతెలంగాణ క్రీడావిభాగం
టెస్టు క్రికెట్‌లోనే కాదు, వైట్‌బాల్ ఫార్మాట్‌లోనూ పిచ్‌లపై చర్చను భారత ఆటగాళ్లు ఇష్టపడరు. పేస్ పిచ్‌పై మూడు రోజుల్లో ఫలితం తేలటం.. స్పిన్ పిచ్‌పై మూడు రోజుల్లో మ్యాచ్ ముగియటం ఒక్కటే అనే అభిప్రాయం గట్టిగా చెబుతారు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లోనూ భారత జట్టు కోరుకున్న పిచ్‌లపై ఆడింది. ప్రత్యర్థి బలహీనతలకు అనుగుణంగా ఏ వేదిక, ఏ తరహా పిచ్ కావాలనే డిమాండ్లను నెరవేర్చుకుంది. పోటీతత్వ ఆధునిక క్రికెట్‌లో ఆతిథ్య అనుకూలతను సద్వినియోగం చేసుకోవటం తప్పు కాదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లు సొంతగడ్డపై తమకు అనుకూలమైన పిచ్‌లనే కోరుకుంటాయి. స్వదేశంలో టీమ్ ఇండియా స్పిన్ పిచ్‌లను కోరటం రహస్యం ఏమీ కాదు. ఆతిథ్య జట్టుకు అనుకూల పిచ్ ఉండాలని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ గట్టిగా వాదించారు. ఇప్పుడు ఆ విపరీత అనుకూలతనే భారత్ కొంపముంచింది. స్పిన్ స్వర్గధామ పిచ్‌లపై పసలేని ప్రత్యర్థి స్పిన్నర్లు.. నాణ్యమైన భారత స్పిన్నర్లతో సమానంగా రాణించారు. ఇక్కడే.. టెస్టు, సిరీస్ ఫలితం తలకిందులైంది.
టాస్ పాత్ర తగ్గిద్దామని..
గత 12 ఏండ్లలో స్వదేశంలో భారత్ ఏడు టెస్టుల్లో పరాజయం పాలైంది. అందులో నాలుగు టెస్టులు స్పిన్ స్వర్గధామ పిచ్‌లపైనే జరిగాయి. మిగతా మూడు టెస్టుల్లో.. బెంగళూర్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, హైదరాబాద్‌లో ఒలీ పోప్ అసమాన ఇన్నింగ్స్, 2021 చెన్నై టెస్టులో జో రూట్ ఇన్నింగ్స్ ఓటమికి దోహదం చేశాయి. గతంలో భారత్ మూడో రోజు నుంచి స్పిన్‌కు అనుకూల పిచ్‌లను తయారు చేసింది. కానీ 2021 చెన్నై టెస్టులో జో రూట్ ఇన్నింగ్స్ మన ఆలోచనలను మార్చివేసింది. టాస్ ఓడితే.. బ్యాటింగ్‌కు అనుకూల పరిస్థితుల్లో ప్రత్యర్థి పరుగులు పిండుకుంటుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల వేట సైతం దీనికి తోడైంది. దీంతో సంప్రదాయ స్పిన్ పిచ్‌ల నుంచి ర్యాంక్ టర్నర్‌లను భారత్ కోరుకుంది. దీంతో టాస్ ఓడినా.. ప్రత్యర్థికి పెద్దగా అనుకూలత ఉండదని భావించింది. కానీ టాస్ పాత్ర తొలగిందని గణాంకాలు చెప్పలేకపోతున్నాయి. టాస్ నెగ్గిన జట్టు కనీసం తొలి మూడు గంటలైనా బ్యాటింగ్‌కు అనుకూల పరిస్థితులు ఆస్వాదిస్తుంది. టాస్ ఓడిన జట్టుకు ఆ పరిస్థితి లేదు. తొలి మూడు గంటల్లో 100-150 పరుగులు చేసినా.. ఆ తర్వాత అన్ని పరుగులు చేసేందుకు ఎన్ని కష్టాల్లో పడాలో ఇటీవల సిరీస్‌లో మనం చూశాం.
పసలేని స్పిన్నర్ల హవా!
భారత్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో స్పిన్నర్ల సగటు 24 కంటే తక్కువ. 2017 నుంచి స్వదేశీ టెస్టుల్లో స్పిన్ స్వర్గధామ పిచ్‌లపై స్పిన్నర్ల సగటు 24 కంటే దిగువ ఉంటే భారత స్పిన్నర్ల సగటు 16.37గా ఉంది. ఇదే సమయంలో ప్రత్యర్థి స్పిన్నర్ల సగటు 22.91గా నమోదైంది. ఇక్కడ నాణ్యమైన భారత స్పిన్నర్ల సగటుకు.. పసలేని ప్రత్యర్థి స్పిన్నర్ల సగటు వ్యత్యాసం స్వల్పం. 2017 నుంచి స్వదేశీ టెస్టుల్లో స్పిన్నర్ల సగటు 24 కంటే ఎక్కువగా ఉంటే.. ఆ టెస్టుల్లో భారత స్పిన్నర్ల సగటు 26.22 కాగా ప్రత్యర్థి స్పిన్నర్ల సగటు 57.04. మూడో రోజు నుంచి టర్న్ లభించే పిచ్‌లపై రివర్స్ స్వింగ్ సైతం లభిస్తుంది. ఈ పిచ్‌లపై వికెట్‌పై నిలకడగా మాయజాలం చేయాలి. బ్యాటర్‌ను తెలివిగా ఉచ్చులో పడేయాలి. అశ్విన్, జడేజా వంటి ప్రపంచ శ్రేణి స్పిన్నర్లు మాత్రమే వికెట్ల వేటలో సఫలీకృతం కాగలరు. కానీ ర్యాంక్ టర్నర్‌లపై పసలేని స్పిన్నర్లు సైతం మాయ చేస్తున్నారు. 2020 నుంచి భారత్‌లో జరిగిన టెస్టుల్లో ఆరుగురు ప్రత్యర్థి జట్ల స్పిన్నర్లు కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. జో రూట్, మిచెల్ శాంట్నర్, టాడ్ మర్ఫీ, టామ్ హార్ట్లీ, మాట్ కున్హేమాన్, షోయబ్ బషీర్ ఐదు వికెట్లు పడగొట్టారు. తొలి రోజు నుంచే స్పిన్ తిరిగే పిచ్‌పై అశ్విన్, జడేజా మాయకు.. ప్రత్యర్థి స్పిన్నర్ల మాయకు పెద్దగా వ్యత్యాసం లేకుండా పోయింది.
రోహిత్, ద్రవిడ్ జోడీ అలా..
ర్యాంక్ టర్నర్‌లు పసలేని స్పిన్నర్లను రేసులోకి తేవటమే కాదు మన బ్యాటర్ల ప్రదర్శనను సైతం ప్రభావితం చేస్తున్నాయి. 2017 నుంచి స్వదేశీ టెస్టుల్లో సంప్రదాయ పిచ్‌లపై విరాట్ కోహ్లి బ్యాటింగ్ సగటు 90.25. ఈ పిచ్‌లపై స్పిన్నర్ల సగటు 24 కంటే ఎక్కువ. కానీ స్పిన్నర్ల సగటు 24కు దిగువ ఉన్న టెస్టుల్లో కోహ్లి బ్యాటింగ్ సగటు 20.13కు పడిపోయింది. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు సాధారణ పిచ్‌లను కోరుకుంది. 2024 హైదరాబాద్ టెస్టులో ఓటమి ఎదురైనా.. చివరి నాలుగు టెస్టుల్లో సాధారణ పిచ్‌లపైనే విజయాలు సాధించింది. ఓటమి ఎదురైందని.. విపరీతంగా టర్న్ లభించే పిచ్ కావాలని క్యూరేటర్‌ను కోరలేదు. బెంగళూర్ ఓటమితో పుణెలో, ముంబయిలో ర్యాంక్ టర్నర్‌లను భారత్ కోరుకుంది. పుణె, ముంబయి టెస్టుల్లో భారత్ టాస్ నెగ్గితే ఫలితాలు భిన్నంగా ఉండేవి కావచ్చు. కానీ మన స్పిన్నర్ల, మన బ్యాటర్ల ప్రదర్శనను తగ్గించే స్పిన్ స్వర్గధామ పిచ్‌లను కోరి మరీ సిద్ధం చేయించి.. ఓటమి పాలవటం దారుణం.