విశాఖలో స్పిన్‌బాల్‌

విశాఖలో స్పిన్‌బాల్‌– 106 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం
– 399 ఛేదనలో ఇంగ్లాండ్‌ 292 ఆలౌట్‌
– అశ్విన్‌, బుమ్రా మూడేసి వికెట్ల జోరు
– టెస్టు సిరీస్‌ 1-1తో సమం
దెబ్బకు దెబ్బ. లెక్క సమం. హైదరాబాద్‌లో బజ్‌బాల్‌ పైచేయి సాధించగా, విశాఖలో స్పిన్‌బాల్‌ జోరందుకుంది. భారత పేసర్లు, స్పిన్నర్లు విజృంభించటంతో ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ తోకముడిచింది. 399 పరుగుల ఛేదనలో బెన్‌స్టోక్స్‌ సేన 292 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా, అశ్విన్‌ మూడేసి వికెట్లతో మ్యాజిక్‌ చేయటంతో ఇంగ్లాండ్‌ ఛేదనలో చేతులెత్తేసింది. రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో గెలుపొందిన టీమ్‌ ఇండియా.. 1-1తో సిరీస్‌ సమం చేసింది.
కోహ్లి లేడు. జడేజా దూరమయ్యాడు. రాహుల్‌ సైతం గాయపడ్డాడు. అయినా, హైదరాబాద్‌ టెస్టు పరాజయం నుంచి టీమ్‌ ఇండియా గొప్పగా పుంజుకుంది. బ్యాట్‌తో యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ చెలరేగగా.. బంతితో సీనియర్‌ బౌలర్లు జశ్‌ప్రీత్‌ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌లు మాయ చేశారు. ఇంగ్లాండ్‌ గత పర్యటనలో మాదిరిగానే తొలి టెస్టులో నెగ్గి.. ఆ తర్వాత ఆతిథ్య జట్టు ధాటికి విలవిల్లాడింది. భారత్‌, ఇంగ్లాండ్‌ మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జరుగనుంది.
నవతెలంగాణ-విశాఖపట్నం
విశాఖ టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై 106 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా (3/46), మాస్టర్‌ మాయగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ (3/72) మూడేసి వికెట్ల ప్రదర్శనతో ఛేదనలో ఇంగ్లాండ్‌ను వణికించారు. ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రావ్లీ (73, 132 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌ అర్థ సెంచరీతో మెరిసినా.. ఇతర బ్యాటర్లు ఎవరూ భారత బౌలర్ల ముందు నిలబడలేకపోయారు. బెన్‌ ఫోక్స్‌ (36, 69 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), టామ్‌ హర్ట్‌లీ (36, 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), జానీ బోయిర్‌స్టో (26, 36 బంతుల్లో 5 ఫోర్లు) ఇంగ్లాండ్‌ ఓటమి అంతరాన్ని కుదించగలిగారు. 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి తొమ్మిది వికెట్లు కూల్చిన జశ్‌ప్రీత్‌ బుమ్రా ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. హైదరాబాద్‌ టెస్టు, విశాఖ టెస్టులు నాలుగు రోజుల్లోనే ముగియటం గమనార్హం.
లంచ్‌లోపే ఖాయం
ఓవర్‌నైట్‌ స్కోరు 67/1తో నాల్గో రోజు ఛేదనకు వచ్చిన ఇంగ్లాండ్‌.. బజ్‌బాల్‌తో భారత్‌ను భయపెట్టేందుకు చూసింది. కానీ, భారత బౌలర్లు ఇంగ్లాండ్‌ బ్యాటర్లను క్రమం తప్పకుండా ఇరకాటంలో పడేశారు. నైట్‌ వాచ్‌మన్‌ రెహాన్‌ అహ్మద్‌ (23, 31 బంతుల్లో 5 ఫోర్లు) అంచనాలకు మించి రాణించాడు. ఓపెనర్‌ జాక్‌ క్రావ్లీతో కలిసి రెండో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడికి అక్షర్‌ పటేల్‌ విడదీశాడు. వికెట్ల ముందు రెహాన్‌ అహ్మద్‌ను మాయ చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌ రెండో వికెట్‌కు కోల్పోయింది. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 83 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన జాక్‌ క్రావ్లీ.. ఛేదనను ముందుకు నడిపించాడు. తొలి టెస్టు హీరో ఒలీ పోప్‌ (23, 21 బంతుల్లో 5 ఫోర్లు) దూకుడుగా ఆడినా.. వికెట్‌ నిలుపుకోలేదు. స్లిప్స్‌లో వేగంగా కదిలిన రోహిత్‌ శర్మ ఎడమ చేతితో ఒలీ పోప్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో డ్రింక్స్‌ విరామం ముంగిట ఇంగ్లాండ్‌ కీలక మూడో వికెట్‌ కోల్పోయింది. లంచ్‌ విరామం లోపు మరో మూడు వికెట్లు పడగొట్టిన భారత్‌.. విశాఖ టెస్టును చేతుల్లోకి తీసుకుంది. ఓ ఎండ్‌లో జాక్‌ క్రావ్లీ నిలకడగా నిలబడ్డాడు. కానీ, మరో ఎండ్‌లో సరైన సహకారం లభించలేదు. జో రూట్‌ (16, 10 బంతుల్లో 2 ఫోర్లు) సిరీస్‌లో వరుసగా నాల్గో ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. రెండు బౌండరీలతో జో రూట్‌ దూకుడు సంకేతాలు పంపినా.. అశ్విన్‌ మాయలో ఇరుకున్నాడు. నాల్గో వికెట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత జానీ బెయిర్‌స్టో (26, 36 బంతుల్లో 5 ఫోర్లు)తో కలిసి జాక్‌ క్రావ్లీ విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. ఐదో వికెట్‌కు 66 బంతుల్లోనే 40 పరుగులు జోడించాడు. బెయిర్‌స్టో సైతం ఐదు బౌండరీలతో మంచి దూకుడు మీద కనిపించాడు. దీంతో తొలి సెషన్లో ఇంగ్లాండ్‌ పైచేయి సాధించేలా కనిపించింది. కానీ, లంచ్‌ విరామం ముందు రెండు ఓవర్లలో భారత్‌ మెరుపు దెబ్బ కొట్టింది. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు జాక్‌ క్రావ్లీ వికెట్ల ముందు దొరికిపోగా, ఆ తర్వాతి ఓవర్లో బుమ్రా బంతికి బెయిర్‌స్టో కథ ముగిసింది. దీంతో ఒక్క పరుగూ జోడించకుండానే జాక్‌ క్రావ్లీ, జానీ బెయిర్‌స్టో వికెట్లు వరుసగా పడ్డాయి. తొలి సెషన్‌ ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ 194/6తో ఓటమి కోరల్లో కూరుకుంది. కుల్దీప్‌, బుమ్రా వరుస ఓవర్లలో వికెట్లు ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టగా.. మ్యాచ్‌ను దాదాపు భారత్‌ పరం చేశాయి.
లాంఛనం త్వరగానే..
రెండో సెషన్‌ ఆరంభంలో భారత్‌ విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలువగా, ఇంగ్లాండ్‌కు మరో 205 పరుగులు అవసరం. భారత్‌ మ్యాచ్‌పై తిరుగులేని పట్టు సాధించినా.. ఇంగ్లాండ్‌ సారథి బెన్‌ స్టోక్స్‌ (11) క్రీజులో ఉన్నాడు. ఛేదనలో అసమాన ఇన్నింగ్స్‌లు నమోదు చేసిన బెన్‌ స్టోక్స్‌ విశాఖలో ఏం చేస్తాడో అనే చిన్న ఆందోళన అభిమానుల్లో కనిపించింది. కానీ శ్రేయస్‌ అయ్యర్‌ మెరుపు ఫీల్డింగ్‌తో బెన్‌ స్టోక్స్‌ కథ ముగిసింది. సింగిల్‌ తీసే ప్రయత్నంలో బెన్‌ స్టోక్స్‌ రనౌట్‌గా నిష్క్రమించాడు. బెన్‌ స్టోక్స్‌ ఏడో వికెట్‌ రూపంలో నిష్క్రమించటంతో భారత్‌కు ఇక లాంఛనమే మిగిలింది. వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ (36, 69 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), టెయిలెండర్‌ టామ్‌ హర్ట్‌లీ (36, 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఎనిమిదో వికెట్‌కు భారత్‌ను విసిగించారు. 74 బంతుల్లో 55 పరుగులు జోడించిన ఫోక్స్‌, హర్ట్‌లీ ఓటమి అంతరాన్ని తగ్గించగలిగారు. బెన్‌ ఫోక్స్‌ను రిటర్న్‌ క్యాచ్‌ ద్వారా అవుట్‌ చేసిన బుమ్రా.. హర్ట్‌లీ వికెట్లను గిరాటేశాడు. అంతకముందు ముందు షోయబ్‌ బషీర్‌ (0)ను ముకేశ్‌ కుమార్‌ బోల్తా కొట్టించాడు. దీంతో 69.2 ఓవర్లలోనే ఛేదనలో ఇంగ్లాండ్‌ కథ ముగిసింది. భారత బౌలర్ల మాయకు ఇంగ్లాండ్‌ తలొంచినా.. ఓవర్‌కు 4.21 పరుగులు చొప్పున జోడించటం విశేషం.
భారత్‌కు బుమ్రా చాంపియన్‌ ఆటగాడు. ఇటువంటి విజయాల్లో జట్టు ఓవరాల్‌ ప్రదర్శన చూడాలి. ఈ పరిస్థితుల్లో టెస్టు విజయం అంత సులువు కాదు. బౌలర్లు బాధ్యత తీసుకున్నారు. జైస్వాల్‌ గొప్పగా ఆడాడు. భారత్‌కు ఇంకెన్నో ఇన్నింగ్స్‌లు ఆడగలడు. ఇంగ్లాండ్‌ జట్టు మంచి క్రికెట్‌ ఆడుతోంది. ఆ జట్టుపై యువ జట్టుతో విజయం గొప్పగా ఉంది. చాలా మంది బ్యాటర్లు జట్టుకు కొత్త. మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఈ ఫార్మాట్‌కు కొత్త కావటంతో నేర్చుకునేందుకు కాస్త సమయం పడుతుంది. మరో మూడు మ్యాచులు మిగిలి ఉన్నాయి. చాలా అంశాలు సరి చేసుకోవాల్సి ఉంది
– రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్‌
స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 396/10
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 253/10
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 255/10
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : జాక్‌ క్రావ్లీ (ఎల్బీ) కుల్దీప్‌ యాదవ్‌ 73, బెన్‌ డకెట్‌ (సి) భరత్‌ (బి) అశ్విన్‌ 28, రెహాన్‌ అహ్మద్‌ (ఎల్బీ) అక్షర్‌ పటేల్‌ 23, ఒలీ పోప్‌ (సి) రోహిత్‌ శర్మ (బి) అశ్విన్‌ 23, జో రూట్‌ (సి) అక్షర్‌ పటేల్‌ (బి) అశ్విన్‌ 16, జానీ బెయిర్‌స్టో (ఎల్బీ) బుమ్రా 26, బెన్‌ స్టోక్స్‌ రనౌట్‌ 11, బెన్‌ ఫోక్స్‌ (సి,బి) బుమ్రా 36, టామ్‌ హర్ట్‌లీ (బి) బుమ్రా 36, షోయబ్‌ బషీర్‌ (సి) భరత్‌ (బి) ముకేశ్‌ 0, జేమ్స్‌ అండర్సన్‌ నాటౌట్‌ 5, ఎక్స్‌ట్రాలు : 15, మొత్తం : (69.2 ఓవర్లలో ఆలౌట్‌) 292.
వికెట్ల పతనం : 1-50, 2-95, 3-132, 4-154, 5-194, 6-194, 7-220, 8-275, 9-281, 10-292.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 17.2-4-46-3, ముకేశ్‌ కుమార్‌ 5-1-26-1, కుల్దీప్‌ యాదవ్‌ 15-0-60-1, రవిచంద్రన్‌ అశ్విన్‌ 18-2-72-3, అక్షర్‌ పటేల్‌ 14-1-75-1.