తప్పులు అందరూ చేస్తారు.
త్యాగాలు కొందరే చేస్తారు.
ఆ త్యాగాలు బలిదానాలు, ఆ నిస్వార్థ ప్రజాఉద్యమాలు ఆ ప్రజాపోరాటాలే అంతిమంగా మానవాళిని ముందుకు నడిపిస్తాయి. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. అయినా మన ఆధునిక కాలంలో యుద్ధాలు ఇంకా జరుగుతూనే వున్నాయి. ఆధిపత్యం కోసం ఘర్షణలు చెలరేగుతూనే వున్నాయి. కుల, మత, ప్రాంత, భాషా, లింగ వివక్షలు కొనసాగుతూనే వున్నాయి. ఆకలి, అనారోగ్యం, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత నీడలా మనల్ని వెంటాడుతూనే వున్నాయి.
‘వేల సంవత్సరాలుగా మానవాళి సాధించిన ప్రగతి ఇదా?’ అని మన ఎదుట నిలబడి మనల్ని మనం ప్రశ్నించుకునే స్థితి నుండి మనం పారిపోలేం.
మనిషి దోపిడీ క్రౌర్యంలో భాగంగా మానవాళికే కాదు సమస్త జీవకోటికి ప్రాణాధారమైన పుడమికే ముప్పువాటిల్లుతున్నది.
ఈ నేపథ్యంలో మనపిల్లల్ని (భావిపౌరుల్ని) తమని తాము కాపాడుకునే విధంగా, తమ పుడమిని రాక్షస విధ్వంసక శక్తులనుండి రక్షించుకునే విధంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ముందుకు వచ్చింది.
ప్రస్తుత విద్యావ్యవస్థలో ఈ సామాజిక బాధ్యత కొరవడింది.
‘తన్ను తాను తెలుసుకోవడమే తత్వజ్ఞానం’ అన్నాడు వేమన. తాను ఎందుకు పుట్టాడో… ఎందుకు పెరుగుతున్నాడో… అసలు జీవితం అంటే ఏమిటి? జీవితాన్ని సార్ధకం చేసుకోవడం ఎలా..? – ఈ చింతనే మనిషిని మహోన్నతుడిని గావించింది. అందుకు బుద్దునికి రాజ్యమూ రాజ్యాధికారమూ తృణప్రాయమై పోయింది. కడకు ధర్మమే మిగిలింది.
విద్యలో ఇలాంటి మానవీయ విలువలు పాదుకొల్పినప్పుడు, అవి నిత్యజీవన విధానంగా, సంస్కృతిగా మారినప్పుడు మాత్రమే మనిషి నిజమైన సామాజికుడిగా (మంచి పౌరునిగా) ఎదుగుతాడు. లేని పక్షంలో కెరీర్ (వ్యక్తిగత అభివృద్ధి) పేరుతో స్వార్థపరునిగా వివేచన మరిచి తెలియకుండా హింస, విధ్వంసం వైపు అడుగు విడతాడు. దారితప్పి చివరకు స్వీయహననం వైపుకూ మరలుతాడు.
ప్రస్తుతం ఉన్నత చదువులు చదివినవారు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్న కారణమిది.
శాస్త్ర సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ (కృత్రిమ మేధస్సు) మానవుడు సాధించిన అద్భుత ప్రగతి. దీనిని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. అయితే ఈ శాస్త్రసాంకేతిక ప్రగతిని సక్రమంగా ఉపయోగిస్తున్నామా? దురుపయోగపరుస్తున్నామా? అనేదే జీవితకాలపు ప్రశ్న.
ఈ ప్రశ్నకు ప్రాథమిక స్థాయిలో ప్రతి గురువు (అధ్యాపకుడు – ఉపాధ్యాయుడు – టీచర్) విస్పష్టంగా సమాధానం ఇవ్వగలగాలి. ఓ జవాబుగా కనపడాలి. నిలబడాలి. లేకుంటే ‘తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే’ అన్న చందంగా తయారవుతుంది మన విద్యావిధానం. పిల్లలకు అలాంటి విద్యను అందించడం ఎప్పుడూ, ఎక్కడా ఎవరికీ శ్రేయస్కరం కాదు.
ఇచ్చిపుచ్చుకోవడం, దయ, ప్రేమ, కరుణ, సమత వంటి మానవీయ లక్షణాలు పాటించకుండా, నేర్పకుండా ఏ బోధనకూ సార్థకత చేకూరదు.
గౌతమ బుద్దుని నుండి మహాత్మాగాంధీ వరకు, మాంటిస్సోరి నుండి గిజూబారు వరకు ఎందరో మహానుభావులు బోధనా నైపుణ్యాలు అభివృద్ధి పరచినవారే. ప్రపంచంలో ఏ ఖండంలోని పిల్లలైనా పిల్లలే. గత వర్తమానాల్లోనే కాదు, భవిష్యత్‌లోనూ పిల్లలు పిల్లలే. పిల్లల్ని పిల్లలుగా గుర్తించడం, ప్రేమించడం, గౌరవించడం, కాపాడుకోవడం పిల్లల వికాసానికి బాటలు పరచడం పెద్దలుగా (టీచర్లుగా) మన విధి, కర్తవ్యం.
– కె.శాంతారావు, 9959745723