తెలంగాణ ఒలింపిక్‌ సంఘంలో చీలిక

హైదరాబాద్‌ : తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీఓఏ)లో విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌లు ఒలింపిక్‌ సంఘంలో వర్గపోరుకు తెరతీశారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి నిర్వహించిన ఎన్నికల్లో ఏపీ జితేందర్‌ రెడ్డి తెలంగాణ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికవగా.. ఆ ఎన్నికలను ప్రత్యర్థి వర్గం గుర్తించలేదు. 21 క్రీడా సంఘాల తిరుగుబాటుతో ఆదివారం జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఒలింపిక్‌ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అండతో ప్రేమ్‌రాజ్‌, సి బాబురావు అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. మల్కా కొమురయ్య సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, శంకర్‌ తుంకూర్‌ కోశాధికారిగా.. జగన్నాథ స్వామి, కల్పనా రెడ్డి, నాగమణి, జెజె శోభలు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్టు ఓ ప్రకటనలో తెలిపారు.
38వ జాతీయ క్రీడలకు చెఫ్‌ డి మిషన్‌ ఎంపిక చేసే బాధ్యతను టీఓఏ నుంచి చేతుల్లోకి తీసుకున్న భారత ఒలింపిక్‌ సంఘం.. శాట్‌ వీసీ ఎండి సోనీ బాలదేవిని చెఫ్‌ డి మిషన్‌గా మరో ఇద్దరిని డిప్యూటీ చెఫ్‌ డి మిషన్‌గా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ క్రీడల ప్రిన్సిపల్‌ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌కు లేఖ ద్వారా తెలియజేసింది. చెఫ్‌ డి మిషన్‌ ఎంపిక బాధ్యత టీఓఏకు ఇవ్వకపోటంతో పరోక్షంగా ఎన్నికైన ఏపీ జితేందర్‌ రెడ్డి ప్యానల్‌కు భారత ఒలింపిక్‌ సంఘం గుర్తింపు నిరాకరించింది. దీంతో, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మద్దతుతో 21 క్రీడా సంఘాలు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నాయి. రానున్న జాతీయ క్రీడల నేపథ్యంలో తెలంగాణ ఒలింపిక్‌ సంఘం చీలిక ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.