– బీఎస్‌ఎఫ్ అదనపు డీజీ అనురాగ్ గర్గ్
– ఎన్‌పీఏలో జాతీయ పోలీసు అశ్విక క్రీడలు ప్రారంభం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిది
మనిషిలోని గెలుపు స్ఫూర్తిని క్రీడలు మరింతగా పెంచుతాయనీ, అందుకు అశ్విక క్రీడలు కూడా దోహదం చేస్తాయని సరిహద్దు భద్రతా దళం అదనపు డైరెక్టర్ జనరల్ అనురాగ్ గర్గ్ అన్నారు. శివరామ్‌పల్లిలోని సర్ధార్ వలభభారు పటేల్ జాతీయ పోలీసు అకాడమీ(ఎన్‌పీఏ)లో జాతీయ పోలీసు అశ్విక క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో శాంతి భద్రతలను కాపాడే పోలీసులకు దేహదారుఢ్యం కూడా అత్యంత కీలకమనీ, ఇందుకు శారీరక వ్యాయామంతో పాటు వివిధ క్రీడలు కూడా తోడ్పడతాయని ఆయన అన్నారు. ముఖ్యంగా, పోలీసు శాఖలో అశ్విక దళాలు అనేక సందర్భాలలో శాంతి భద్రతలను కాపాడటానికి కీలక పాత్ర వహించాయని అనురాగ్ గర్గ్ తెలిపారు. దీనికి సంబంధించి ప్రతి ఏడాదీ పోలీసు అశ్విక క్రీడలను నిర్వహిస్తూ వస్తున్నారని ఆయన అన్నారు. ఈ సారి జాతీయ పోలీసు అశ్విక క్రీడల్లో పాల్గొనటానికి 22 రాష్ట్రాల అశ్విక పోలీసు దళాలు ఇందులో పాల్గొనటం సంతోషకరమని తెలిపారు. ఎన్‌పీఏ జాయింట్ డైరెక్టర్ మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ పోలీసు అశ్విక క్రీడల్లో 351 అశ్వాలు, 22 రాష్ట్రాలు, కేంద్ర పోలీసుబలగాల నుంచి పాల్గొంటున్నాయనీ, 661 మంది అశ్విక పోలీసు బలగాల క్రీడాకారులు పోటీల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు.
మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఈ క్రీడలు వచ్చే జనవరి 6న ముగుస్తాయని చెప్పారు. ఇందులో అశ్విక క్రీడలకు సంబంధించి విభిన్న పోటీలు ఉంటాయని ఆయన వివరించారు. అనంతరం పోలీసు అశ్విక దళాలు నిర్వహించిన కవాతుతో పాటు వివిధ విన్యాసాలు ఆహుతులను అబ్బురపర్చాయి.