– రాష్ట్రానికి గుర్తింపు తెచ్చేలా ప్రతిభావంతులకు ప్రోత్సాహం
– క్రీడాక్యాలెండర్ అమలుకు ఉన్న అవకాశాలు పరిశీలన
– క్రీడా సలహాదారు జితేందర్‌రెడ్డి, శాట్స్ చైర్మెన్ శివసేనారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మారుమూల పాఠశాల స్థాయి నుంచి ప్రతి విద్యార్థినీ, విద్యార్థులు ఏదో ఒక క్రీడలో పాల్గొనే విధంగా తెలంగాణ క్రీడా విధానాన్ని రూపొందిస్తామని క్రీడా సలహాదారు జితేందర్‌రెడ్డి, క్రీడా అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) చైర్మెన్ కె శివసేనారెడ్డి చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజా హోటల్‌లో క్రీడా విధానం ముసాయిదా రూపకల్పన కోసం రాష్ట్రస్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనేలా క్రీడా విధానాన్ని రూపొందించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పించారని గుర్తు చేశారు. అందుకనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చే ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యమని అన్నారు. వారిని ప్రోత్సహించేందుకు పటిష్టమైన క్రీడా విధానాన్ని రూపొందింస్తామన్నారు. యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్ మాట్లాడుతూ క్రీడా ముసాయిదాపై అందిన సూచనలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గతంతో పోల్చితే క్రీడలకు ఈ ఏడాది 10 రెట్లు అధికంగా నిధులను ప్రభుత్వం కేటాయించిందని వివరించారు. క్రీడా క్యాలెండర్ అమలుకు అవసరమైన వసతులతోపాటు నిర్వహణకు క్రీడల అభివృద్ధి నిధుల ఏర్పాటుకు ఉన్న అవకాశాల గురరించి పలువురు సూచనలు చేశారని అన్నారు. క్రీడలను ప్రోత్సహించటంలో ఐటీ, ఫార్మా, ఇతర ప్రముఖ పరిశ్రమల భాగస్వామ్యం ఒక సమావేశాన్ని నిర్వహించాలని పలువురు అభిప్రాయపడ్డారని వివరించారు. స్టేడియంలు, రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలల్లో ఉన్న వసతులను అభివృద్ధి చేసి, పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న ప్రోత్సాహకాలను పరిశీలించాలని చెప్పారు. పాఠశాల, మండల, జిల్లా స్థాయిల్లో రెగ్యులర్‌గా క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వేణుగోపాలచారి, శాట్స్ వైస్ చైర్మెన్, ఎండీ సోనీ బాలాదేవి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్, ఇస్మాయిల్ బేగ్, ప్రముఖ క్రీడా కన్సల్టెన్సీ పీడబ్ల్యూసీ ప్రతినిధి ప్రాన్షు జైన్, ఇతర క్రీడా ప్రముఖులతోపాటు సింగరేణి, విద్యా, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.