– పెటా టీిఎస్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గౌడ్
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పించే జీఓ ఎం.ఎస్ నం.74ను సవరించి, తెలంగాణ క్రీడాకారులకు న్యాయం చేకూర్చాలని వ్యాయామ ఉపాధ్యాయ సంఘం (పెటా టీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నగాని కృష్ణమూర్తి గౌడ్ ప్రభుత్వాని కోరారు. తెలంగాణ ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, శాట్ వీసీ ఎండీ సోనీ బాలాదేవిలను ఎల్బీ స్టేడియంలోని కార్యాలయంలో కలిసిన టీఎస్ పెటా సంఘం నేతలు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుత జీఓ ప్రకారం అనెక్సర్-3లో పేర్కొన్నట్టు గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు అంతర్జాతీయ స్థాయిలో.. గ్రూప్-3 ఉద్యోగాలకు జాతీయ స్థాయిలో.. గ్రూప్-4 ఉద్యోగాలకు విశ్వవిద్యాలయ స్థాయిలో, ఇతర ఉద్యోగాలకు స్కూల్ గేమ్స్ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులు మాత్రమే అర్హులుగా కొనసాగుతున్నారు.
ఈ విధానంతో ప్రతిభావంతులైన ఎంతోమంది క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018 డిసెంబర్ 3న అనెక్సర్-2లో పొందిపరిచినట్టు 1-90 ప్రాధాన్యత క్రమంలో క్రీడాకారులు స్పోర్ట్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా రిజర్వేషన్ జీవోకు సవరణ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సైతం అనెక్సర్-2 ప్రకారం ప్రాధాన్య క్రమంలో క్రీడాకారులు ఉద్యోగాలు పొందే విధంగా స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ జీవోను సవరించాలని కృష్ణమూర్తి గౌడ్ కోరారు. రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివద్ది పథంలో నడిపించేందుకు ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ యూనివర్శిటీ ఆఫ్ తెలంగాణ బిల్ 2024’ను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెటా టీఎస్ సంఘం ప్రత్యేక అభినందనలు తెలిపింది.