మొగులు.. గుబులు..

మొగులు.. గుబులు..– కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు తెప్పలుగా ధాన్యం రాశులు
– కరీంనగర్‌ జిల్లాలో కొనుగోలు లక్ష్యం 4.5లక్షల మెట్రిక్‌టన్నులు
– ఇప్పటివరకు సేకరించిన ధాన్యం లక్ష మెట్రిక్‌టన్నుల మాత్రమే
– ప్యాడీ సెంటర్ల వద్ద ఆందోళనలో రైతాంగం
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఈ వానాకాలం రైతాంగానికి కలిసొచ్చింది. సాగు ప్రారంభంలో కొంత వర్షాభావ పరిస్థితులు వెంటాడినా తీరా జులై, ఆగస్టు చివరి వారం వరకు కురిసిన భారీ వర్షాల తరువాతనే నాట్లు ముమ్మరం చేసుకున్నారు. దానికితోడు పెద్దగా తెగుళ్ల బెడద లేకుండా కాలం కలిసొచ్చి ఎకరాకు 35 నుంచి 40 బస్తాలపైనే ధాన్యం దిగుబడి రావడంతో రైతులంతా సంతోషించారు.
తీరా కోత సమయానికి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రావడంతో అధికారులంతా ఎలక్షన్‌ ఏర్పాట్ల చుట్టే తిరిగారు. దాంతో తీరిగ్గా గత నెల 26న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణపై ప్రణాళికలు రూపొందించారు. దాంతో నవంబర్‌ మొదటివారం తరువాతనే ప్యాడీ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కోతలన్నీ పూర్తయి ధాన్యమంతా కల్లాలు, ప్యాడీ సెంటర్లలో ఆరబెట్టుకోగా.. గురువారం సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడి అక్కడక్కడా జల్లులు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్‌ జిల్లాలో 335 ధాన్యం కేంద్రాలకు 332 కేంద్రాలను ప్రారంభించారు. 321 కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తున్నారు. ఇందులో ఐకేపీ 50, పీఎసీఎస్‌ 233, డీసీఎమ్‌ఎస్‌ 49, హెచ్‌ఏసీఏ 3 కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా 16,221 మంది రైతుల నుంచి బుధవారం వరకు 97,523మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. గురువారం 9276 మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుతం జిల్లాలో వానాకాలం సీజన్‌ పంటంతా కోత పూర్తయింది. ధాన్యం రాశులన్నీ కల్లాలు, ప్యాడీ సెంటర్లలో ఆరబోసి ఉన్నాయి. ఈ పది రోజుల కాలంలో ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం 16,221 మంది రైతుల నుంచి 97,523 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే ప్రభుత్వం సేకరించింది.
మిగతా సుమారు 3.5లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం అంతా ఆరబోసి ఉంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడిపోయింది. పక్క జిల్లా వరంగల్‌లో ఉదయం నుంచి వర్షం పడుతుండగా.. మెల్లగా దాని సరిహద్దులోని హుజూరాబాద్‌ నియోజకవర్గం మీదుగా చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రకృతిపరంగా ఏ కష్టమూ, నష్టమూ లేకుండా చేతికొచ్చిన పంట.. ఇప్పుడు వర్షాలు ఊపందుకుంటే పరిస్థితి ఏంటనే ఆందోళనలో రైతులు పడ్డారు. గత యాసంగిలో సాగు ప్రారంభంలో, కోతల సమయంలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు చేతికొచ్చిన పంట నీటిపాలవుతుందేమోనన్న బెంగతో ఉన్నారు.