సూపర్‌ సిక్స్‌కు శ్రీలంక

– ఐర్లాండ్‌పై ఘన విజయం
బులావయో (జింబాబ్వే): ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ క్వాలిఫయర్‌ టోర్నమెంట్‌లో శ్రీలంక హ్యాట్రిక్‌ విజయంతో సూపర్‌ సిక్స్‌ దశకు దూసుకెళ్లింది. దిముత్‌ కరుణరత్నె (103 బంతుల్లో 103) శతకానికి తోడు వానిందు హసరంగ (5/79) ఐదు వికెట్లతో చెలరేగడంతో ఆదివారం జరిగిన గ్రూప్‌-బి మ్యాచ్‌లో లంక 133 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 49.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నెతో పాటు సదీర సమరవిక్రమ (82), ధనంజయ డిసిల్వా (42 నాటౌట్‌), చరిత్‌ అసలంక (38) రాణించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో మాక్క్‌ ఎడైర్‌ (4/46), బారీ మెకాతీ (3/56) సత్తా చాటారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ 31 ఓవర్లలో 192 పరుగులకే కుప్పకూలింది. కర్టిస్‌ క్యాంఫర్‌ (39), హారీ టెక్టర్‌ (33), జార్జ్‌ డాక్రెల్‌ (26) తప్ప మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు. హసరంగ ఐదు, మహేశ్‌ పతిరణ రెండు వికెట్లు పడగొట్టారు. కరుణరత్నెకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.వరుసగా మూడో ఓటమితో ఐర్లాండ్‌ గ్రూప్‌ దశలోనే ఇంటిదారి పట్టగా, మరో మ్యాచ్‌ మిగిలుండగానే శ్రీలంక సూపర్‌ సిక్స్‌ బెర్తు సొంతం చేసుకుంది.