శ్రీలంక చిందేసింది

శ్రీలంక చిందేసింది– భారత్‌పై 32 పరుగుల తేడాతో గెలుపు
– వన్డే సిరీస్‌లో 1-0తో ముందంజ
నవతెలంగాణ-కొలంబో : భారత్‌కు షాక్‌. రెండో వన్డేలో ఆతిథ్య శ్రీలంక సంచలన విజయం సాధించింది. అగ్ర జట్టు భారత్‌ను మరోసారి కట్టడి చేసింది. లెగ్‌ స్పిన్నర్‌ జెఫ్రీ వండర్సే (6/33) ఆరు వికెట్లతో విజృంభించగా శ్రీలంక 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 241 పరుగుల ఛేదనలో టీమ్‌ ఇండియా 42.2 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక కెప్టెన్‌ చరిత్‌ అసలంక (3/20) సైతం మూడు వికెట్లతో మాయజాలం సృష్టించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (40, 62 బంతుల్లో 5 ఫోర్లు), కుశాల్‌ మెండిస్‌ (30, 42 బంతుల్లో 3 ఫోర్లు) మినహా టాప్‌ ఆర్డర్‌లో ఎవరూ మెప్పించలేదు. లోయర్‌ ఆర్డర్‌లో డ్యునిత్‌ వెల్లలాగె (39), కామిందు మెండిస్‌ (40) మెరుపు ఇన్నింగ్స్‌లతో శ్రీలంకకు మంచి స్కోరు అందించారు. మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంక 1-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. భారత్‌, శ్రీలంక తొలి వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే. మూడో వన్డే కొలంబోలోనే బుధవారం జరుగనుంది. ఆరు వికెట్లతో చెలరేగిన జెఫ్రీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.