– నెదర్లాండ్స్‌పై 83 పరుగులతో గెలుపు
– ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024
గ్రాస్‌ఐలెట్ : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో లంకేయులు ఎట్టకేలకు ఓ విజయం సాధించారు. గ్రూప్-డిలో నేపాల్‌తో మ్యాచ్ వర్షార్పణం కావటంతో నిరాశజనకంగా మొదలైన శ్రీలంక వేట.. ఆ తర్వాతి రెండు మ్యాచుల్లోనూ పరాజయం చవిచూసింది. సూపర్8 ఆశలు ఆవిరి చేసుకున్న శ్రీలంక గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో ఊరట విజయం సాధించింది. సోమవారం గ్రాస్‌ఐలెట్‌లో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు చేసింది. చరిత్ అసలంక (46, 21 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కుశాల్ మెండిస్ (46, 29 బంతుల్లో 5 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (34, 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ఎంజెలో మాథ్యూస్ (30 నాటౌట్, 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) దంచికొట్టారు. ఇక భారీ ఛేదనలో నెదర్లాండ్స్ చతికిల పడింది. ఓపెనర్ మైకల్ లెవిట్ (31, 23 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్‌లు), స్కాట్ ఎడ్వర్డ్స్ (31, 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా డచ్ శిబిరం నుంచి ఎవరూ అంచనాలను అందుకోలేదు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార (3/24), వానిందు హసరంగ (2/25), మతీశ పతిరణ (2/12) వికెట్ల వేటలో మెరిశారు. 16.4 ఓవర్లలో 118 పరుగులకే నెదర్లాండ్స్ కథ ముగిసింది. 83 పరుగుల భారీ తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. శ్రీలంక బ్యాటర్ చరిత్ అసలంక ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.