రమాదేవి కులకర్ణి, రచయిత్రి, కవయిత్రి, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణురాలు, సభా వ్యాఖ్యాత, అంతర్జాలంలో విలక్షణ సమూహాన్ని నిర్వహిస్తున్న అడ్మిన్‌గా అందరికీ సుపరిచితులు. కొంత కాలం మేడ్చెల్ జిల్లా రచయితల సంఘం బాధ్యుల్లో ఒకరుగా నిలిచింది. వృతి రీత్యా పిల్లల పాఠశాల ప్రధానోపాధ్యాయిని. ఇటీవల పిల్లల కోసం చక్కని గేయ రామాయణాన్ని వ్రాసి ప్రచురించింది. హైదరాబాద్‌లోటున్న రమాదేవి కులకర్ణి అక్టోబర్ 30, 1968న మెదక్‌లో పుట్టింది. తల్లితండ్రులు శ్రీమతి గిరిజమ్మ-శ్రీ శంకర్‌రావు కులకర్ణి.
ఆంగ్లం, హిందీ సాహిత్యాల్లో ఎం.ఎ.లతో పాటు సైకాలజీలోనూ ఎం.ఎ చేసిన రమాదేవి కులకర్ణి తొలుత రెండు దశాబ్ధాలపాటు డిగ్రీ విద్యార్థులకు ఆంగ్ల భాషాధ్యాపనం చేశారు. ప్రస్తుతం పిల్లల పాఠశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. బోధనను అత్యంత ఇష్టంగా భావించే ఈమె తొలినుండి బోధనా రంగంలోనే ఉన్నారు. ఈటివి వంటి సంస్థ ద్వారా మోటివేషనల్ స్పీకర్‌గా గుర్తించబడి అనేక సదస్సుల్లో పాల్గొన్న రమాదేవి కొంత కాలం వాట్సప్ ద్వారా ఉచిత ఇంగ్లీష్ స్పీకింగ్ క్లాసులు నిర్వహించారు. వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాలతో సన్నిహిత సంబంధం ఉన్న ఈమె దివ్యదిశ వంటి ఆశ్రమాల్లో తరగతులను నిర్వహించారు. పిల్లలపై పడుతున్న అనేక భారాల తొలగింపుకోసం తపన పడుతున్న రమాదేవి ‘యునాప్రో’ యూట్యూబ్ చానల్ ద్వారా అందుకోసం కృషిచేస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలో సదస్సులు, సెమినార్లు చేస్తున్నారు.
వచన కవిత్వం, గేయం, పాట మొదలుకుని దాదాపు అన్ని ప్రక్రియలు, రూపాల్లో రచనలు చేసిన రమాదేవి గజల్ కవయిత్రిగా దాదాపు రెండువేల గజళ్ళు రచించారు. కవియిత్రిగా ఆమె తొలి కవితా సంపుటి ‘రెప్పచాటు మౌనం’. సాయి భక్తురాలైన రమాదేవి తన రచనలో ఆయనకు పెద్ద పీట వేశారు. అలా వచ్చిన రచనే ‘అన్నీ తెలిసిన అయ్యకు వందనం’ పుస్తకం. కవయిత్రిగా రమాదేవికి గుర్తింపును, పురస్కారాలు, గౌరవాలను తెచ్చి పుట్టిన పుస్తకం ‘చెత్తబండి’ దీర్ఘ కవిత. దీనిని చెత్త సేకరించుకునే వారితో ఆవిష్కరింపజేశారు. ‘ఒక్కసారి ఆలోచిద్దాము’ త్వరలో ముద్రణలోకి రానుంది. ‘కణిక’ను అంతర్జాల సమూహంగానే కాక ‘నేటి నిజం’ పత్రికద్వారా ప్రతి బుధవారం కవితా శీర్షికను నిర్వహిస్తూ కవి ‘బాద్షా’లుగా వారిని తస్కరిస్తున్నారు. కణిక ద్వారా రమాదేవి నేతృత్వంలో ‘శ్రావణ రాగం’, ‘అయోద్య రామయ్య’, ‘దేశం మనేద’, ‘నీకై…’ వంటి సంకలనాలు వెలువడ్దాయి. గేయ కవయిత్రిగా కనిగిరి వేంకటేశ్వర స్వామిపై రాసిన పాటలు ఆడియో సిడి ద్వారా వెలువడ్డాయి. కవయిత్రిగానే కాక ఉపాధ్యాయినిగా, ఇతర రంగాల్లో ప్రతిభకు ఈమె పలు సత్కారాలు, సన్మానాలు అందుకున్నారు. వాటిలో గురజాడ ఫౌండేషన్ యు.ఎస్‌ఎ జాతీయ పురస్కారం, సహస్ర కవిమిత్ర, గడియారం సాహితీ పీఠం, జమ్మలమడుగు ‘హాస్య వతంస’, నెల్లూరు స్నేహపరిమళం ‘అక్షర కణిక’, శ్రీకరి వారి ‘స్ఫూర్తి రత్న’ ఐటాప్ వారి ‘బెస్ట్ ప్రిన్సిపల్’గా పురస్కారాలు అందుకున్నారు.
నిరంతరం పిల్లలతో గడిపే అద్భుత అవకాశం కలిగిన రమాదేవి, వారు పాడుకునేందుకు వీలుగా ఇటీవల బాలల కోసం ‘శ్రీరామ కథ’ బాలగేయ సుధగా రామాయణాన్ని చెప్పి బాలల రచయితల సరసన నిలిచారు. దీనిని పుస్తకంగానే కాదు ఆడియోగా తెచ్చారు ఈమె. రామాయణ కథను వందలాది సంవత్సరాలు అనేక మంది తమదైన పద్దతిలో చెబుతున్నారు. ‘మరల ఇదేల’ అన్నట్టు కాకుండా ఎవరి శైలి వారిది. రమాదేవిది బాలల శైలి, అవును అచ్చంగా వాళ్ళ కోసమే కూర్చబడ్డ రచనయిది. నిజానికి చదవడం కంటే ఆ ఆడియో వింటే పిల్లలకు ఎంత కనెక్ట్ అవుతుందో తెలుస్తుంది. రమాదేవి ఈ రామాయణాన్ని ఎవరికోసం రాశారో వారినుద్దేశించి ‘బుజ్జమ్మా బుజ్జోడు../ శ్రద్దగా అందరం విందాము/ కలిసిమెలిసి ఉందాము/ అమ్మా నాన్న అన్నతమ్ములు/ గురువులు స్రీలను గౌరవిద్దాము’ అంటారు. ఒక రామాయణం విషయానికి వస్తే ‘మహాగొప్ప రాజు అతడు / ఎంతో పుణ్యవంతుడు / దాన ధర్మాలెన్నో చేశాడు/ పిల్లలు లేరని బాధపడ్డాడు’ అని రాస్తే పిల్లలకు అర్థం కాకుండా ఎలా ఉంటుంది. ఇంకా ‘మహాలక్ష్మియే సీతగా/ నాగేటి సాలలో దొరకగా’ అంటూ సీతమ్మ పుట్టకను గురించి ఎరుకజేస్తారు. రామయ్య వంటి ధర్మగుణం/ సీతమ్మ వంటి మంచిగుణం/ లక్ష్మణుని వంటి సేవాగుణం/ హనుమ వంటి బుద్ధి బలం’ అంటూ ప్రధాన పాత్రల గొప్పతనాన్ని చక్కగా పిల్లలకు తెలియజేశారు. నూటా ఎనిమిది చిన్న గేయాల్లో, ఒక మకుటంతో ఆసక్తి కలిగేలా చెప్పడం బాగుంది. ‘తళతళ మెరిసెను బంగరు లేడి/ చకచక గెంతెను మాయాలేడి’ అంటూ రాస్తే ఆ లేడి పిల్ల పిల్లల కళ్ళ ముందు గెంతకుండా ఎలా ఉంటుంది. ‘రాముడు అంటే రాముడు/ దయా హృదయ సంపన్నుడు’ ఇంకా ‘ఎందరు చెప్పిన వినడు కదా/ అహంకారి రావణుడు కదా’ వంటి గేయ పాదాలను చూస్తే ఈ ‘రమా’యణం ఎంత సరళంగా ఉందో తెలుస్తుంది. బాలల కోసం రామాయణాన్ని రాసిన ఈ బాలల మొల్లకు అభినందనలు… జయహో! బాల సాహిత్యం. రమా! బాల సాహిత్యంలోకి వచ్చిన మీకు అలాయి.. బలాయి!
– డా|| పత్తిపాక మోహన్
9966229548