కేటీఆర్‌కు సృజన్‌రెడ్డి లీగల్‌ నోటీస్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సూదిని సృజన్‌రెడ్డి లీగల్‌ నోటీస్‌ పంపించారు. అమృత్‌ టెండర్ల విషయంలో లేనిపోని ఆరోపణలు చేసినందుకు లీగల్‌ నోటీసులు పంపించినట్టు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరి బంధువు కావడం వల్లే టెండర్లు ఇచ్చారంటూ కేటీఆర్‌ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. తన కంపెనీ శోభ కన్‌స్ట్రక్షన్‌ను 2010లో ఏర్పాటు చేశామనీ, 2020 నుంచి ఏఐఆర్‌, ఐహెచ్‌పీలతో కలిసి జాయింట్‌ వెంచర్‌గా పనిచేస్తుందని పేర్కొన్నారు. అమృత్‌ టెండర్లలో రూ.1,110 కోట్ల పనులను నిబంధనల ప్రకారమే దక్కించుకున్నామని అన్నారు. కేటీఆర్‌ చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలనీ, లేకుంటే చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని నోటీస్‌లో పేర్కొన్నారు.