– సింధు, ప్రణరు సైతం ముందంజ
– మంజునాథ్, కిరణ్ జార్జ్ ఓటమి
– ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్
సిడ్నీ (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ 500 సిరీస్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్లు క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. నూతన వ్యక్తిగత కోచ్ హఫీజ్ శిక్షణ సారథ్యంలో వరుసగా రెండు టోర్నీల్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన పి.వి సింధు సిడ్నీలో పురోగతి సాధించింది. సహచర షట్లర్ ఆకర్షి కశ్యప్‌పై విజయంతో మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకుంది. మెన్స్ సింగిల్స్‌లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్, సీనియర్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణరు, యువ ఆటగాడు ప్రియాన్షు రజావత్ సైతం క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపారు.
మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ పి.వి సింధు అలవోక విజయం సాధించింది. భారత యువ షట్లర్ ఆకర్షి కశ్యప్‌పై 21-14, 21-10తో సునాయాసంగా గెలుపొందింది. 39 నిమిషాల రెండో రౌండ్ పోరులో ఆకర్షి కశ్యప్ నుంచి సింధుకు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. రెండు గేముల్లోనూ చెమట పట్టకుండా పైచేయి సాధించిన పి.వి సింధు…నేడు క్వార్టర్‌ఫైనల్లో అమెరికా షట్లర్, నాల్గో సీడ్ బీవెన్ జాంగ్‌తో పోటీపడనుంది. సింధు తొలి రౌండ్లో సైతం భారత్‌కే చెందిన వర్థమాన షట్లర్ అష్మిత చాలిహపై 21-18, 21-13తో గెలుపొందిన సంగతి తెలిసిందే. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ ఆకట్టుకున్నాడు. చైనీస్ తైపీ షట్లర్ సు లై యాంగ్‌పై 21-10, 21-17తో వరుస గేముల్లో అదిరే విజయం సాధించాడు. 39 నిమిషాల్లోనే క్వార్టర్స్ బెర్త్ దక్కించుకున్నాడు. ఆరో సీడ్ హెచ్.ఎస్ ప్రణరు సైతం రాణించాడు. చైనీస్ తైపీ షట్లర్ చి హు జెన్‌తో జరిగిన మూడు గేముల మారథాన్ మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం సాధించాడు. 19-21, 21-19, 21-13తో ప్రణరు చెలరేగాడు. 74 నిమిషాల ఉత్కంఠ పోరులో ప్రణరు పైచేయి సాధించి క్వార్టర్స్‌కు చేరాడు. యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ 21-8, 13-21, 21-19తో చైనీస్ తైపీ షట్లర్ వాంగ్ జు వీపై మెరుపు విజయం సాధించాడు. సంచలన షట్లర్ మిథున్ మంజునాథ్ 13-21, 21-12, 19-21తో లీ జి జియ (మలేషియా) చేతిలో పోరాడి ఓడాడు. కిరణ్ జార్జ్ పోరాటం సైతం రెండో రౌండ్లోనే ముగిసింది. 15-21, 18-21తో ఆంటోని గింటింగ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. నేడు మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో సహచర షట్లర్ ప్రియాన్షు రజావత్‌తో కిదాంబి శ్రీకాంత్..టాప్ సీడ్ ఆంటోని గింటింగ్ (ఇండోనేషియా)తో హెచ్.ఎస్ ప్రణరు తలపడనున్నారు.