– ఇండియా ఓపెన్ తొలి రౌండ్‌లోనే ఓటమి
న్యూఢిల్లీ: మాజీ నంబర్‌వన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ఆటతీరు మారలేదు. భారత్ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్-750 టోర్నమెంట్‌లో శ్రీకాంత్ 22-24, 13-21 తేడాతో హాంకాంగ్‌కు చెందిన లీ చెక్ యూ చేతిలో వరుససెట్లలో ఓడాడు. తొలి సెట్‌లో పోటాపోటీగా ఆడిన శ్రీకాంత్.. 18వ ర్యాంకర్ లీ చెక్‌తో నువ్వా నేనా అన్నట్టుగా పోరాడాడు. ఒకదశలో ఇరువురు 17-17తో సమంగా ఉన్నా లీ మూడు గేమ్ పాయింట్స్ సాధించడంతో అతడు పైచేయి సాధించాడు. తర్వాత శ్రీకాంత్ పుంజుకున్నా రెండు పాయింట్ల ఆధిక్యంతో లీ.. తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో మరింత రెచ్చిపోయిన హాంకాంగ్ ప్లేయర్.. సెట్‌తో పాటు గేమ్‌నూ సొంతం చేసుకున్నాడు. మరో ఆటగాడు లక్ష్యసేన్ కూడా మంగళవారం తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఇక పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు ప్రతీక్-కృష్ణ ప్రసాద్‌ల ద్వయం 14-21, 11-21 తేడాతో ఒకమురా-మిస్తుహాషి(జపాన్) జోడీ చేతిలో, మహిళల డబుల్స్‌లో అయూష్ భట్-శ్రీరామ్ గౌతమ్‌ల జంట 12-21, 3-21 తేడాతో సౌత్ కొరియన్ జోడీ కిమ్-కాంగ్‌ల చేతిలో ఓడారు. మరో పోరులో భారత స్టార్ ద్వయం తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప 5-21, 21- 18, 11-21 తేడాతో రవీండా-కిటితరకుల్ చేతిలో ఓడారు.