శ్రీకాంత్‌ ఔట్‌

– స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
బసెల్‌ : తెలుగు తేజం, మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ పోరాటానికి తెరపడింది. స్విస్‌ ఓపెన్‌తో ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించిన శ్రీకాంత్‌ ఆశలు ఆవిరయ్యాయి. పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లోనే శ్రీకాంత్‌ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. హాంగ్‌కాంగ్‌ ఆటగాడి చేతిలో వరుస గేముల్లో శ్రీకాంత్‌ పరాజయం పాలయ్యాడు. 20-22, 17-21తో క్వార్టర్స్‌ బెర్త్‌ కోసం పోరాడినా ఫలితం దక్కలేదు. తొలి గేమ్‌ విరామ సమయానికి 11-10తో ముందంజలో నిలిచిన శ్రీకాంత్‌.. 20-16తో గేమ్‌ పాయింట్‌ దగ్గర నిలిచాడు. ఇక్కడ వరుసగా విలువైన పాయింట్లు చేజార్చుకున్న శ్రీకాంత్‌ 20-22తో తొలి గేమ్‌ కోల్పోయాడు. ఇక రెండో గేమ్‌లో హాంగ్‌కాంగ్‌ షట్లర్‌ లీ జోరు తగ్గలేదు. 5-5, 6-6 తర్వాత శ్రీకాంత్‌ ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయాడు. మరో షట్లర్‌ మిథున్‌ మంజునాథ్‌ 18-21, 10-21తో చైనీస్‌ తైపీ షట్లర్‌ చేతిలో కంగుతిన్నాడు.