క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌, ప్రణయ్

– రెండో రౌండ్లో సింధు పరాజయం
– ఇండోనేషియా ఓపెన్‌
జకర్తా (ఇండోనేషియా)
భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి క్రీడాకారిణి, రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పి.వి సింధు వైఫల్య యాత్ర కొనసాగుతుంది. గత రెండు టోర్నీల్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన సింధు.. తాజాగా ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో రెండో రౌండ్లో ఓటమి పాలైంది. పి.వి సింధు పరాజయంతో మహిళల సింగిల్స్‌లో భారత టైటిల్‌ ఆశలకు తెరపడింది. చైనీస్‌ తైపీ స్టార్‌ షట్లర్‌ తైజుయింగ్‌తో ప్రీ క్వార్టర్‌ఫైనల్లో 18-21, 16-21తో సింధు తడబాటుకు గురైంది. 39 నిమిషాల్లో ముగిసిన ప్రీ క్వార్టర్స్‌లో సింధు పెద్దగా ప్రతిఘటించలేదు. రెండు గేముల్లోనూ తైజుయింగ్‌ అలవోకగానే గెలుపొందింది. ఈ విజయంతో సింధుపై ముఖాముఖి రికార్డును 19-5తో మరింత మెరుగుపర్చుకుంది. సైనా నెహ్వాల్‌ ఇండోనేషియా ఓపెన్‌కు దూరం కాగా, యువ షట్లర్‌ ఆకర్షి కశ్యప్‌ తొలి రౌండ్లో కొరియా అమ్మాయి యంగ్‌ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. పురుషుల సింగిల్స్‌లో మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌.ఎస్‌ ప్రణరు క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. తొలుత ఆల్‌ ఇండియన్‌ క్వార్టర్‌ఫైనల్లో సహచర, యువ షట్లర్‌ లక్ష్యసేన్‌పై కిదాంబి శ్రీకాంత్‌ వరుస గేముల్లో గెలుపొందాడు. 21-17, 22-20తో 45 నిమిషాల్లోనే క్వార్టర్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు. తొలి గేమ్‌లో 16-16 వరకు శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ సమవుజ్జీలుగా నిలిచినా.. ఆ తర్వాత కిదాంబి అనుభవంతో ముందంజ వేశాడు. వరుస పాయింట్లతో 21-17తో తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లోనూ 13-13 వరకు ఆధిపత్యం ఎవరికీ దక్కలేదు. ఈ సమయంలో వరుసగా ఆరు పాయింట్లు సాధించిన కిదాంబి శ్రీకాంత్‌ 19-13తో తిరుగులేని ఆధిక్యం సాధించాడు. గొప్పగా పుంజుకున్న లక్ష్యసేన్‌ తనూ వరుసగా ఆరు పాయింట్లు కైవసం చేసుకుని.. కిదాంబిని మ్యాచ్‌ పాయింట్‌ వద్ద నిలువరించాడు. 20-20తో స్కోరు సమం చేశాడు. వరుస పాయింట్లతో ఉత్కంఠకు తెరదించిన శ్రీకాంత్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. సీనియర్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌ ప్రణరు 21-18, 21-16తో ప్రీ క్వార్టర్స్‌లో గెలుపొందాడు. హాంగ్‌కాంగ్‌ ఆటగాడు ఆంగస్‌ లాంగ్‌పై వరుస గేముల్లోనే పైచేయి సాధించాడు. యువ షట్లర్‌ ప్రియాన్షు రజావత్‌ ప్రీ క్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యాడు. ఇండోనేషియా ఆటగాడు ఆంటోనితో మూడు గేముల పోరులో పోరాడి ఓడాడు. 22-20, 15-21, 15-21తో ఆంటోనికి గట్టి పోటీ ఇచ్చాడు. పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ 21-17, 21-15తో విజయం సాధించింది. చైనా జోడీ హీ జి టింగ్‌, హవో డాంగ్‌లపై వరుస గేముల్లో గెలుపొంది క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. నేడు జరిగే మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ జోడీతో మనోళ్లు పోటీపడనున్నారు.