అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరిచిన చిన్నారి శ్రీమేధస్వి!

అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరిచిన చిన్నారి శ్రీమేధస్వి!బహుశా పుట్టినప్పుడే ఆ చిన్నారి భవిష్యత్తు తల్లిదండ్రుల మదిలో మెదిలిందేమో… తమ పాపకు శ్రీమేధస్వి అనే పేరు పెట్టారు ఇనుముల శ్రీనివాస్‌, రవళిక దంపతులు. నాలుగేళ్ళ చిరు ప్రాయంలోనే శ్రీమేధస్వి తన మేధస్సుతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. మూడు నిమిషాల ఆరు సెకన్లలో ఐదు వందలకు పైగా ఫ్లాష్‌ కార్డ్స్‌ ను పఠించింది. అంతేకాదు… 15 సంస్కత శ్లోకాలను, 30కు పైగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ గేయాలను, 50 జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలకు సమాధానాలను చకచకా చెప్పేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది ఈ పాప. డిసెంబర్‌ 27న ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ అమతసర్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వెయ్యికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. అందులో సూపర్‌ టాలెంటెడ్‌ కిడ్‌ అవార్డును శ్రీమేధస్వి సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎల్‌.కె.జి. చదువుతున్న ఈ చిన్నారి తల్లిదండ్రుల నుండే ఈ శ్లోకాలను, గీతాలను, జీకే ప్రశ్నలను జవాబులను అభ్యసించింది. ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ ఈ చిన్నారికి అందించిన సర్టిఫికెట్‌ లో పేర్కొన్నట్టుగా శ్రీమేధస్వి నిజంగానే ‘వన్‌ ఇన్‌ ఏ మిలియన్‌’! సో… రాబోయే రోజుల్లో మరింకెన్ని అవార్డులను శ్రీమేధస్వి ఇనుముల సొంతం చేసుకుంటుందో చూడాలి.